Telugu Global
NEWS

ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాహుల్ గాంధీని యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ వైస్ ఛాన్స్ లర్ కి ఆదేశాలిచ్చింది. దీంతో గత 6 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయింది. మే 6న రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 6వ తేదీ ఆయన హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 7న ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అయితే ఓయూలోకి రాహుల్ […]

ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
X

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాహుల్ గాంధీని యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ వైస్ ఛాన్స్ లర్ కి ఆదేశాలిచ్చింది. దీంతో గత 6 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయింది. మే 6న రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 6వ తేదీ ఆయన హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 7న ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. అయితే ఓయూలోకి రాహుల్ గాంధీని అనుమతించబోమని ఇదివరకే యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతలు పదే పదే అభ్యర్థనలు ఇచ్చినా ఆయన కుదరదన్నారు. అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించి ఎట్టకేలకు అనుమతి సాధించింది.

రాహుల్ గాంధీతో ఓయూలో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేసింది. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఉపకులపతిని ఆదేశించింది హైకోర్టు సింగిల్ బెంచ్. సింగిల్ బెంచ్ సూచనల మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నా వీసీ నిరాకరించారు. దీంతో తమ దరఖాస్తుని వీసీ పరిగణలోకి తీసుకోలేదంటూ.. కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన విషయంలో కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. భారీగా బలప్రదర్శన చేపట్టాలని భావిస్తోంది. అదే సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ కి నో ఎంట్రీ అంటూ వైస్ ఛాన్స్ లర్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ మరింత పట్టుదలకు పోయింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు నిరసనలు చేపట్టారు, ఆందోళనలు శృతి మించడంతో ఓ దశలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ తో వ్యవహారం మరింత ముదిరింది. చివరకు రాహుల్ పర్యటన విషయంలో హైకోర్టు జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

First Published:  1 May 2022 9:40 PM GMT
Next Story