Telugu Global
National

పరిహారం మాకొద్దు.. రగులుతున్న నాగాలాండ్..

తీవ్రవాదులుగా పొరబడి భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు చనిపోయిన ఘటన నాగాలాండ్ లో కార్చిచ్చు రాజేసింది. కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించినా బాధిత కుటుంబాలు వెనక్కి తగ్గలేదు. పరిహారంగా ఇచ్చిన చెక్కుని కూడా ప్రభుత్వానికి తిప్పి పంపించేశాయి. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగాలాండ్ వాసులు డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నాగాలాండ్‌ లోని మోన్ జిల్లా ఒటింగ్ గ్రామస్థులు, బాధిత […]

పరిహారం మాకొద్దు.. రగులుతున్న నాగాలాండ్..
X

తీవ్రవాదులుగా పొరబడి భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు చనిపోయిన ఘటన నాగాలాండ్ లో కార్చిచ్చు రాజేసింది. కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించినా బాధిత కుటుంబాలు వెనక్కి తగ్గలేదు. పరిహారంగా ఇచ్చిన చెక్కుని కూడా ప్రభుత్వానికి తిప్పి పంపించేశాయి. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగాలాండ్ వాసులు డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

నాగాలాండ్‌ లోని మోన్ జిల్లా ఒటింగ్ గ్రామస్థులు, బాధిత కుటుంబాలు ఈమేరకు ఓ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం పరిహారం కిందట మొదటి విడత అడ్వాన్సుగా పంపిన రూ.18,30,000 ను తిప్పి పంపించారు ఒటింగ్ గ్రామ పంచాయతీ పెద్దలు. తాము అంత్య క్రియల హడావిడిలో ఉండగా.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ మొత్తం తీసుకున్నామని, అయితే అది తమపై ఉన్న అభిమానానికి చిహ్నంగా భావించామని తెలిపారు. ఆ తర్వాత అది ప్రభుత్వం పంపిన పరిహారం అడ్వాన్స్‌ అని తెలుసుకున్నామని, అందుకే తిప్పి పంపించామని చెప్పారు. భారత సాయుధ బలగాల 21వ పారా కమాండోలపై సివిల్ కోడ్ ఆఫ్ లా కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్.. (AFSPA) ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సైన్యం కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కొరికి రూ.5 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున నాగాలాండ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, ఈ పరిహారం తీసుకునే ప్రసక్తేలేదని బాధిత కుటుంబాలు తేల్చి చెబుతున్నాయి.

కాల్పుల ఘటన అనంతరం పార్లమెంట్‌ లో హోం మంత్రి అమిత్‌ షా ఇచ్చిన వివరణపై కూడా నాగాలాండ్ వాసులు మండిపడుతున్నారు. సైనికులు సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాహనం ఆపకుండా ముందుకు కదలడంతో ఉగ్రవాదులనే అనుమానంతో సైన్యం పౌరులపై కాల్పులు జరిపిందని అమిత్ షా పేర్కొనడాన్ని వారు తప్పుబట్టారు. తమకు అలాంటి సిగ్నల్ ఏదీ రాలేదని, తమ వాహనంపై ఉద్దేశపూర్వకంగానే సైనికులు కాల్పులు జరిపినట్లు జవాన్ల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి తెలపడం విశేషం. ఈ నేపధ్యంలో హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు ఒటింగ్ గ్రామస్తులు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పరిహారం తీసుకోకుండా ఆందోళనలు చేపట్టిన బాధిత కుటుంబాలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి.

First Published:  13 Dec 2021 7:52 AM GMT
Next Story