Telugu Global
NEWS

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం..

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెల్ల మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఒకటీ రెండు కేసులు రాగా.. ఇప్పుడు పదుల సంఖ్యలో స్కూల్ పిల్లలు కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రతి వారం విద్యార్థులు, టీచర్లకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేయడంతో అధికారికంగా ఆ సంఖ్య పెరుగుతోంది. గురుకుల పాఠశాలల్లో భయం భయం.. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో కరోనా భయం పెరుగుతోంది. సామాజిక దూరం, కొవిడ్ నియమాలు పాటిస్తున్నా.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. నెల్లూరు […]

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం..
X

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెల్ల మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఒకటీ రెండు కేసులు రాగా.. ఇప్పుడు పదుల సంఖ్యలో స్కూల్ పిల్లలు కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రతి వారం విద్యార్థులు, టీచర్లకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేయడంతో అధికారికంగా ఆ సంఖ్య పెరుగుతోంది.

గురుకుల పాఠశాలల్లో భయం భయం..
గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో కరోనా భయం పెరుగుతోంది. సామాజిక దూరం, కొవిడ్ నియమాలు పాటిస్తున్నా.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోట మండలం చిట్టేడులో గిరిజన గురుకుల పాఠశాలలో 19మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. స్కూల్ లో ఉన్న 500మంది విద్యార్థుల్లో మొత్తం 100మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకినవారిని గూడురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా.. తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం గురుకులాల్లోనే కాదు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోనే ఉన్న మనుబోలు మండలంలోని ఎలిమెంటరీ, హైస్కూల్స్ లో మొత్తం నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఆయా చోట్ల స్కూళ్లకు తాత్కాలికంగా సెలవు ప్రకటించి శానిటైజ్ చేయిస్తున్నారు అధికారులు.

గుంటూరులో పెరుగుతున్న కేసులు..
అటు గుంటూరు జిల్లాలో కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేగింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 10 మంది కరోనా బారినపడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ సోకింది. బాపట్ల మండలం నరసాయపాలెం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. శానిటైజేషన్ చేపట్టారు.

గురుపూజోత్సవం రద్దు..
కరోనా నేపథ్యంలో గురుపూజోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధ్యాయులకు అవార్డులిచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసింది. స్కూళ్లు, కాలేజీల్లో గురు పూజోత్సవాలు జరపొద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కేసుల లెక్క మాత్రమే తేలుతోంది. ప్రైవేట్ స్కూల్స్ లో పరీక్షలు పగడ్బందీగా నిర్వహించకపోవడంతో.. అక్కడ కేసులు వెలుగులోకి రావడంలేదు. అయితే పిల్లల్లో కరోనా లక్షణాలు ఉన్నా కూడా.. ప్రభావం స్వల్పంగా ఉండటం ఒక్కటే సంతోషించదగ్గ విషయం. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించబోతున్నట్టు తెలుస్తోంది.

First Published:  4 Sep 2021 9:59 PM GMT
Next Story