Telugu Global
National

ఆదాయం తగ్గిపోయిందంటూ రైల్వేపై నిందలు.. ప్రైవేటీకరణకోసమేనా..?

మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యవహారంలో మరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అవకాశం వస్తే దేన్నీ వదిలిపెట్టకుండా అన్నింటినీ ప్రైవేటీకరణ చేసేందుకు రెడీ అంటోంది. ఈ క్రమంలో ముందుగా ఆయా సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నట్టు ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరర్థకం, నిష్ప్రయోజనం అంటూ తేల్చేసి, ఆ తర్వాత మెల్లగా వాటిని ప్రైవేటు బాట పట్టించేందుకు రాచమార్గం సృష్టిస్తుంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు రైల్వే కూడా చేరబోతున్నట్టు స్పష్టమవుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల రైల్వేల‌కు రూ.36 వేల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని […]

ఆదాయం తగ్గిపోయిందంటూ రైల్వేపై నిందలు.. ప్రైవేటీకరణకోసమేనా..?
X

మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యవహారంలో మరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అవకాశం వస్తే దేన్నీ వదిలిపెట్టకుండా అన్నింటినీ ప్రైవేటీకరణ చేసేందుకు రెడీ అంటోంది. ఈ క్రమంలో ముందుగా ఆయా సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నట్టు ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరర్థకం, నిష్ప్రయోజనం అంటూ తేల్చేసి, ఆ తర్వాత మెల్లగా వాటిని ప్రైవేటు బాట పట్టించేందుకు రాచమార్గం సృష్టిస్తుంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు రైల్వే కూడా చేరబోతున్నట్టు స్పష్టమవుతోంది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల రైల్వేల‌కు రూ.36 వేల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి రావు సాహెబ్ ద‌న్వే తాజాగా ప్రకటించారు. భార‌తీయ రైల్వేల‌కు గూడ్స్ రైళ్ల‌తోనే నిజమైన ఆదాయం వ‌స్తుంద‌ని సెలవిచ్చారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత్ లో ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడూ నష్టాల్లోనే నడుస్తున్నాయని అన్నారు. టికెట్ల ధ‌ర‌లు పెంచితే ప్యాసింజ‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డుతుందని, అందుకే ఆ పని చేయట్లేదని, మొత్తంగా క‌రోనా వ‌ల్ల రైల్వేల‌కు రూ.36 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్యాసింజర్ రైళ్లను పెంచినా ప్రయోజనం ఉండదని అన్నారు.

కరోనా కష్టకాలంలో అన్ని సంస్థలూ నష్టాల్లోనే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా రైల్వే నష్టాలు ఇంత అని చెప్పడంలో మర్మమేంటో అర్థం కావడంలేదు. మరోవైపు రైల్వే లైన్ల ప్రైవేటీకరణ విషయంలో కూడా కేంద్రం చురుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపిక చేసిన 109 మార్గాల్లో రైళ్లు నడిపేందుకు గతంలోనే ప్రైవేటు కంపెనీల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’(ఆర్ఎఫ్‌క్యూ)ని ప్రభుత్వం ఆహ్వానించింది. 2023 ఏప్రిల్‌ నాటికి ప్రైవేటు రైలు సేవలు ప్రారంభిస్తామని రైల్వే బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు కూడా. అయితే అది ప్రైవేటీకరణ కాదని అంటున్నా.. ఆ దిశగా పడుతున్న తొలి అడుగు అనే చెప్పాలి. ప్రైవేటు రైళ్లకు మార్గం తెరిస్తే రైల్వేలోకి రూ.30వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్త టెక్నాలజీ వస్తుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయని అంటున్నారు. రైళ్లన్నీ భారత్ లోనే తయారవుతాయి కాబట్టి అలా కూడా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ప్రైవేటు రైళ్లకోసం గార్డ్, డ్రైవర్లను రైల్వేశాఖ ఇస్తుంది, మిగతా ఏర్పాట్లన్నీ ప్రైవేటు కంపెనీలే చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే అప్పట్లో ఈ ప్రతిపాదనలకు ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. తాజాగా.. రైల్వే నష్టాల్లో ఉందని, వేల కోట్ల రూపాయలు వృథా అవుతోందని ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోంది. అంతిమంగా ఈ నష్టాలకు పరిష్కారం ప్రైవేటీకరణతోనే సాధ్యమవుతుందని చెబుతారు. ఇప్పటినుంచే క్రమంగా రైల్వే వ్యవస్థపై ప్రజలకు ఓ అపనమ్మకం కలిగించి, క్రమక్రమంగా దాన్ని ప్రైవేటీకరిస్తారని తెలుస్తోంది. కరోనా కష్టకాలాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ట్రైన్లను పట్టాలెక్కించేందుకు కేంద్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే.. రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

First Published:  22 Aug 2021 10:07 PM GMT
Next Story