Telugu Global
NEWS

విశాఖ ఉక్కుతో బీజేపీ డబుల్ గేమ్..

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నామని, దాని నుంచి వెనక్కి రావడం సాధ్యం కాదని కేంద్రం చాలాసార్లు స్పష్టం చేసింది. అయితే ఇటు ఉక్కు పోరాట సమితి తమ నిరసనలను ఆపేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది. బీజేపీ కానీ, దాని మిత్రపక్షం జనసేన కానీ.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రైవేటీకరణ ఆపాలంటూ పవన్ కల్యాణ్ లేఖలు […]

విశాఖ ఉక్కుతో బీజేపీ డబుల్ గేమ్..
X

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నామని, దాని నుంచి వెనక్కి రావడం సాధ్యం కాదని కేంద్రం చాలాసార్లు స్పష్టం చేసింది. అయితే ఇటు ఉక్కు పోరాట సమితి తమ నిరసనలను ఆపేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది. బీజేపీ కానీ, దాని మిత్రపక్షం జనసేన కానీ.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రైవేటీకరణ ఆపాలంటూ పవన్ కల్యాణ్ లేఖలు రాసి సరిపెట్టారు. ఇటు అధికార పక్షం, ప్రతిపక్షం కూడా తప్పు మీహయాంలో జరిగిందంటే, మీరే చేశారంటూ విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికార వైసీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపినా.. దానివల్ల ఫలితం ఎంతమేర ఉంటుందో వేచి చూడాలి. బీజేపీ మాత్రం డబులే గేమ్ అడుతూ ఉక్కు అంశాన్ని కూడా ప్రత్యేక హోదా అంశం లాగా నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన ముద్దాయి బీజేపీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలంటూ డిమాండ్లు చేసిన వారు, హామీలు గుప్పించిన వారు.. ఆ తర్వాత మౌనాన్ని ఆశ్రయించారు. ఏపీకి ఇస్తే మరిన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయంటూ ప్యాకేజీ పేరుతో హోదాని అటకెక్కించారు. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలోని బీజేపీ నేతలు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విశాఖ ఉక్కుకి మద్దతిస్తున్నట్టు కవర్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాబోదని, దానిని కాపాడే బాధ్యతను బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకుంటుందని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే ప్రసక్తే లేదని చెప్పారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమిస్తున్నవారు డెయిరీలు, చక్కెర కర్మాగారాలు, స్పిన్నింగ్‌ మిల్లులు ప్రైవేటుపరం చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. నిజంగానే ఏపీ బీజేపీ ఆ బాధ్యత తీసుకుంటే, ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలో అంత విలువ ఉంటుందని అనుకుంటే.. ఈ పాటికే పరిశ్రమల శాఖ మంత్రితోనో లేదా ప్రధానితోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయించి ఉండేవారు. కేంద్రం ప్రైవేటీకరణకు సిద్ధమైన వేళ, రాష్ట్ర పార్టీ మాత్రం ప్రజల్ని ఇంకా భ్రమల్లో నెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి..
మరోవైపు, విశాఖతో ఉన్న అనుబంధం దృష్ట్యా.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు సీపీఐ నేత నారాయణ. మిజోరం గవర్నర్ గా వెళ్తున్న హరిబాబు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని, దానిపై హామీ లభిస్తేనే ఆయన గవర్నర్ గా వెళ్లాలని కోరారు నారాయణ. వామపక్షాల డిమాండ్లు ఎలా ఉన్నా.. విశాఖ ఉక్కుపై ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. వేలకోట్ల విలువైన భూముల్ని లెక్కలోకి తీసుకోకుండా, నష్టాలను పరిగణలోకి తీసుకుని ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది.

First Published:  11 July 2021 8:39 PM GMT
Next Story