Telugu Global
NEWS

సుస్థిర అభివృద్ధిలో నెంబర్ 3 ఏపీ.. నెంబర్ 11 తెలంగాణ..

సుస్థిర అభివృద్ధి సూచికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ, 11వ స్థానంతో సరిపెట్టుకుంది. పలు అంశాలలో రాష్ట్రాల పురోగతిని వెల్లడిస్తూ నీతిఆయోగ్ ఈ జాబితా ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు ర్యాంకులిచ్చింది. మొత్తం 100మార్కులకు కేరళ 75 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 74 మార్కులతో హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నాయి. 72 మార్కులతో గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్‌ లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో […]

సుస్థిర అభివృద్ధిలో నెంబర్ 3 ఏపీ.. నెంబర్ 11 తెలంగాణ..
X

సుస్థిర అభివృద్ధి సూచికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ, 11వ స్థానంతో సరిపెట్టుకుంది. పలు అంశాలలో రాష్ట్రాల పురోగతిని వెల్లడిస్తూ నీతిఆయోగ్ ఈ జాబితా ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు ర్యాంకులిచ్చింది. మొత్తం 100మార్కులకు కేరళ 75 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 74 మార్కులతో హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నాయి. 72 మార్కులతో గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్‌ లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది.

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల్లో రాష్ట్రాల పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్‌ ఈ నివేదికలు విడుదల చేస్తోంది. మొత్తం 16 లక్ష్యాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 16 లక్ష్యాల్లో ‘అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇంధన లభ్యత విభాగంలో’ ఆంధ్రప్రదేశ్‌ 100 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఏపీతో పాటు మరో 14 రాష్ట్రాలు కూడా ఈ అంశంలో 100 మార్కులు సాధించాయి. విభాగాలవారీగా 5 అంశాల్లో ఏపీ టాప్‌-5లో ఉంది. ‘సముద్ర జీవనం’ విషయంలో 2వ స్థానంలో నిలవగా, ‘రక్షితనీరు, పారిశుధ్యం’ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది ఏపీ. ‘పేదరికం లేకపోవడం’ అనే విభాగంలోనూ టాప్ 5లో ఉంది ఏపీ. గతేడాది కంటే ఈ ఏడాది ఏపీ స్కోరు 5 మార్కులు పెరిగాయి.

తెలంగాణ విషయానికొస్తే.. 16 లక్ష్యాల్లో ఒకదానిలో 100కి 100 మార్కులు సాధించింది. ‘అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇంధన లభ్యత’ విభాగంలో తెలంగాణకు సెంట్ పర్సెంట్ లభించింది. విభాగాల వారీగా చూస్తే తెలంగాణ 4 అంశాల్లో టాప్‌-5లో నిలిచింది. మిషన్‌ భగీరథ పథకం కారణంగా ‘గ్రామాలకు రక్షితనీరు అందించడం’ అనే విభాగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. గతేడాది దేశంలోనే 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ, ఈ ఏడాది 11వ ర్యాంకుకి పడిపోయింది.

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌ లు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక డ్యాష్‌ బోర్డు ఆవిష్కరించి, 2020 నివేదికను విడుదల చేశారు. అతి తక్కువగా 52 మార్కులతో బీహార్ చిట్ట చివరి స్థానానికి పరిమితం కావడం విశేషం.

First Published:  3 Jun 2021 8:51 PM GMT
Next Story