Telugu Global
NEWS

రుయా బాధితులకు రూ.10లక్షల పరిహారం..

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు చనిపోయిన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు ఏపీ సీఎం జగన్. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించారాయన. కొవిడ్ తో కలసి జీవించాల్సిన పరిస్థితుల్లో మనమంతా ఉన్నామని, మనం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు సీఎం జగన్. కలెక్టర్లు మరింత అప్రమత్తతతో ఉండాలి.. కలెక్టర్లు, […]

రుయా బాధితులకు రూ.10లక్షల పరిహారం..
X

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు చనిపోయిన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు ఏపీ సీఎం జగన్. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించారాయన. కొవిడ్ తో కలసి జీవించాల్సిన పరిస్థితుల్లో మనమంతా ఉన్నామని, మనం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు సీఎం జగన్.

కలెక్టర్లు మరింత అప్రమత్తతతో ఉండాలి..
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తతతో ఉండాలని, మానవత్వం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాకపోవడం వల్లే, తిరుపతి ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి 11 మంది చనిపోయారని చెప్పారు జగన్. ఆక్సిజన్‌ అవసరాన్ని గుర్తించి ఇటీవల ఎక్కడా లోటు లేకుండా చూస్తున్నామని, గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఆక్సిజన్ కోసం ఒడిశాకు విమానంలో ట్యాంకర్లను పంపించామని, రవాణా సమయాన్ని ఆదా చేయాలని చూస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఆక్సిజన్‌ కొనుగోలు చేసి షిప్ ల ద్వారా తెప్పిస్తున్నామని అన్నారు.

మన తప్పు లేకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్‌ సకాలానికి రాకపోయినా సరే.. బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు సీఎం జగన్. బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వాలని, వారికి బాసటగా నిలవాలని కోరారు. తప్పు ఒప్పుకోవడం చిన్నతనం కాదని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. గడచిన 22 నెలల కాలంలో, ఒక్క బటన్‌ నొక్కి ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలలో జమ చేశామని గుర్తు చేశారు. అలాంటి ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతోందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం హాస్యాస్పదం అని అన్నారు జగన్.

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు అవసరమైతే.. ఇప్పటి వరకూ కేవలం 17 కోట్లు డోసుల టీకా మాత్రమే ఉత్పత్తి అయిందని ఇదీ వాస్తవ పరిస్థితి అని గుర్తు చేశారు జగన్. ఏపీలో 18ఏళ్లు పైబడినవారికి టీకా ఇ్వాలంటే 7 కోట్ల డోసులు అవసరం అని, అయితే ఇప్పటి వరకు ఏపీకి కేవలం 73లక్షల డోసులు మాత్రమే వచ్చాయని తెలిపారు. డబ్బులు తీసుకుని సప్లై చేయాలని కోరినా కూడా కంపెనీలు ఆర్డర్ తీసుకోవడంలేదని, వ్యాక్సిన్ల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉందని చెప్పారు జగన్. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబుతో కలసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారాయన. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారని, కమీషన్లకోసం చూస్తున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఏపీలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్-1 సిటీస్ లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నామని చెప్పారు సీఎం జగన్. మరణాల రేటు ఏపీలో చాలా తక్కువగా ఉందని చెప్పారు. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్లు, వాలంటీర్ల స్థాయి వరకూ అందరూ ఎంతో కమిట్‌ మెంట్‌ తో పనిచేస్తున్నారని, అయినా సరే కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే మరింత సమర్థంగా, మానవత్వంతో, సానుభూతి చూపించి పనిచేద్దామంటూ అధికారులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి.

First Published:  11 May 2021 4:41 AM GMT
Next Story