Telugu Global
NEWS

104కి కాల్ చేస్తే సమస్య పరిష్కారం కావాల్సిందే..

ఏపీలో 104 వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు సీఎం జగన్. 104కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే ఆస్పత్రిలో బెడ్ సౌకర్యం కల్పించాలని, బెడ్ అవసరం లేదన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలన్నారు. 104కి కాల్ చేసిన తర్వాత కొవిడ్ బాధితులకు కచ్చితంగా సాయం అందాలని, కాల్ కలవలేదని, స్పందన లేదనే మాటలు ఎక్కడా వినిపించకూడదని అన్నారు. ఆస్పత్రుల్లో జర్మన్‌ హేంగర్స్‌ ఏర్పాటు చేస్తే […]

104కి కాల్ చేస్తే సమస్య పరిష్కారం కావాల్సిందే..
X

ఏపీలో 104 వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు సీఎం జగన్. 104కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే ఆస్పత్రిలో బెడ్ సౌకర్యం కల్పించాలని, బెడ్ అవసరం లేదన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలన్నారు. 104కి కాల్ చేసిన తర్వాత కొవిడ్ బాధితులకు కచ్చితంగా సాయం అందాలని, కాల్ కలవలేదని, స్పందన లేదనే మాటలు ఎక్కడా వినిపించకూడదని అన్నారు. ఆస్పత్రుల్లో జర్మన్‌ హేంగర్స్‌ ఏర్పాటు చేస్తే పేషెంట్లు వేచి చూసే అవసరం ఉండదని చెప్పారు. కొవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్స్ బృందంతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, అధికారులు ప్రతి రోజు మాక్ కాల్స్ చేసి 104 వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు.

వ్యాక్సిన్ లభ్యత రాష్ట్రం చేతిలో ఉంటుందా..?
వ్యాక్సినేషన్‌ కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తుందని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే ముందస్తుగా డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని, వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని చెప్పారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దురుద్దేశ పూర్వక ప్రచారాలతో, కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సగటున 19 లక్షల టీకా డోసులు మాత్రమే వస్తున్నాయని, నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 6 నెలలు పడుతుందని వివరించారు. 45 ఏళ్లకు పైబడి రెండో డోస్‌ కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందేలా చూడాలని చెప్పారు. రెండో డోస్ వేయడం పూర్తయిన తర్వాతే 45 ఏళ్ల పైబడి తొలిడోస్ కోసం వేచి చూస్తున్నవారికి ప్రయారిటీ ఇవ్వాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చూడాలన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

రోగులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం..
రెమిడిసివిర్ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ ను అడ్డుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై ఆడిట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇంజక్షన్ల పేరిట రోగులను దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచించారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌ రివ్యూ కమిటీలు సమావేశం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించాలన్నారు సీఎం జగన్.

First Published:  10 May 2021 5:49 AM GMT
Next Story