Telugu Global
National

మమత ప్రమాణ స్వీకారోత్సవంలో విమర్శల ఘట్టం..

వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగింది. కోవిడ్‌ కారణంగా మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకార వేదికపైనే గవర్నర్ జగదీప్ ధన్ కడ్, ముఖ్యమంత్రి మమత మధ్య మాటల తూటాలు పేలడం మాత్రం విశేషం. ప్రమాణస్వీకారం వేదికపైనే […]

మమత ప్రమాణ స్వీకారోత్సవంలో విమర్శల ఘట్టం..
X

వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగింది. కోవిడ్‌ కారణంగా మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకార వేదికపైనే గవర్నర్ జగదీప్ ధన్ కడ్, ముఖ్యమంత్రి మమత మధ్య మాటల తూటాలు పేలడం మాత్రం విశేషం.

ప్రమాణస్వీకారం వేదికపైనే గవర్నర్‌ జగదీప్, సీఎం మమత పోటాపోటీగా విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందని, సీఎం మమత హింసను నియంత్రించాలని, కొత్త ప్రభుత్వంలో శాంతి నెలకొనేలా మమత పని చేయాలని గవర్నర్ పేర్కొనడంతో కలకలం రేగింది. పశ్చిమబెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ గవర్నర్ కు లేఖ రాశారు. ఘర్షణల్లో చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ వస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఘర్షణల ప్రస్తావన తీసుకొచ్చి కలకలం రేపారు గవర్నర్. అయితే దీదీ కూడా అంతే ఘాటుగా అక్కడికక్కడే సమాధానమిచ్చారు. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, ఎన్నికల సంఘం పరిధిలో ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఎన్నికల సంఘం, గవర్నర్‌ కారణమని దెప్పిపొడిచారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ హయాంలో బెంగాల్‌ ప్రశాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు.

పశ్చిమబెంగాల్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగగా టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. నందిగ్రామ్‌ లో పోటీచేసిన మమతా బెనర్జీ తన సమీప బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఎన్నికలు వాయిదా పడిన రెండు స్థానాలతోపాటు.. ఎమ్మెల్యే ఎన్నికలోపు అభ్యర్థి మరణించిన మరో స్థానానికి కూడా కొత్తగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు స్థానాల్లో ఎక్కడో ఓ చోట మమతా బెనర్జీ పోటీ చేస్తారని తెలుస్తోంది.

First Published:  5 May 2021 10:06 AM GMT
Next Story