Telugu Global
NEWS

సాగర్​లో ‘సీన్’​ మారుతోంది..

సాగర్​లో గెలుపు ఎవరిది? తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్​ ముందే ఆయన అభ్యర్థి అని ప్రకటించేసింది. జానారెడ్డి కూడా ఇప్పటికే ఓ దశ ప్రచారం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి తన అనుచరులను కలుసుకున్నారు. గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. సాగర్​లో జానారెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువ అని అంతా భావించారు. కానీ ప్రస్తుతం సీన్​ మారింది. […]

సాగర్​లో ‘సీన్’​ మారుతోంది..
X

సాగర్​లో గెలుపు ఎవరిది? తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్​ ముందే ఆయన అభ్యర్థి అని ప్రకటించేసింది. జానారెడ్డి కూడా ఇప్పటికే ఓ దశ ప్రచారం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి తన అనుచరులను కలుసుకున్నారు. గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. సాగర్​లో జానారెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువ అని అంతా భావించారు. కానీ ప్రస్తుతం సీన్​ మారింది. అందుకు కారణం సీఎం కేసీఆర్​ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఫలితాలతో మేల్కొన్న గులాబీ బాస్​ తన వ్యూహాలకు పదునుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్దుతున్నారు.

ఇప్పటికే పలు మండలాలకు, గ్రామాలకు ఎమ్మెల్యేలు, మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. గెలుపు బాధ్యతను నెత్తిన పెట్టారు. వారు కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో టార్గెట్లు పెట్టుకొని పనిచేస్తున్నారు. అంటే ఓట్ల టార్గెట్లు. మరోవైపు కులాల వారీగా కూడా పంపకాలు జోరుగా సాగుతున్నట్టు సమాచారం.

టీఆర్​ఎస్​ పక్కాగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా నిరూపించారు. ఈ సారి కూడా అటువంటి పక్కా ప్లాన్​తోనే ముందుకు సాగుతున్నారు. ఒక్కో ఓటర్​ను కలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల ఓటర్లు, సానుభూతిపరులపై దృష్టి సారించారు. వారిని తమవైపున‌కు తిప్పుకొనేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు గులాబీ నేతలు.

ఈ తతంగం మొత్తం హైదరాబాద్​ నుంచి కొందరు కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కార్యకర్తలతో టచ్​లో ఉంటూ టీఆర్​ఎస్​ నేతలు దూసుకుపోతున్నారు. సాగర్​ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఆ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. అయితే కొన్ని గ్రామాల్లో జానారెడ్డి అనుచరుల హవా ఉంది. ప్రస్తుతం ఆ గ్రామాల మీదే దృష్టి పెట్టారు.

జానారెడ్డి అనుచరులను, అభిమానులను తమవైపు తిప్పుకొనేందుకు టీఆర్​ఎస్​ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. పనిలో పనిగా తమ పార్టీ కార్యకర్తలను కూడా సంతృప్తి పరుస్తున్నారు. ఇక కాంగ్రెస్​ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టీఆర్​ఎస్​తో పోటీ పడలేక పోతున్నది. మరోవైపు జానారెడ్డి గెలిస్తే పీసీసీ అధ్యక్షుడిని చేస్తారన్న ప్రచారం ఊపందుకున్నది. దీంతో సొంత పార్టీ నేతలే అన్యమనస్కంగా పనిచేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓట్లపై కాంగ్రెస్​ దృష్టి సారించింది. ఎందుకంటే మిగిలిన ప్రధాన పార్టీలు ఇతర కులాల నేతలను బరిలోకి దించారు. కాబట్టి రెడ్లు మూకుమ్మడిగా తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్​ అంచనాలు వేస్తున్నది. వీటితోపాటు అనేక గ్రామాల్లో దళితులు సంప్రదాయబద్దంగా కాంగ్రెస్​కు ఓటేస్తారు. ఈ అంశం కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​ లెక్కలు వేసుకున్నది.

కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్​.. అందుకనుగుణంగా పక్కా లెక్కలు వేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతలను తమవైపునకు తిప్పుకున్నారు. ఇక బీజేపీ పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఎందుకంటే సాగర్​ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో బీజేపీకి గ్రామ కమిటీలు కూడా లేవు. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న రవి నాయక్​ జానారెడ్డి అనుచరుడు. ఆయన జానారెడ్డి ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తద్వారా పరోక్షంగా టీఆర్​ఎస్​కే లాభం కలుగబోతున్నది.

First Published:  5 April 2021 3:28 AM GMT
Next Story