Telugu Global
National

తమిళనాట ఉదయిస్తున్న మరో రాజకీయ వారసుడు.. ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్.. ఇక కరుణానిధి మనుమడు, స్టాలిన్ కొడుకు ఏ మాత్రం కాదు. అతడు తమిళనాట ఉదయిస్తున్న మరో రాజకీయ వారసుడు. సినిమాలపై తాతయ్య సినీ వారసత్వాన్ని కొనసాగించడానికి కోలీవుడ్‌లో అడుగుపెట్టినా.. విజయం ఆయన దరి చేరలేదు. అడపా దడపా హిట్లు వచ్చినా.. తన జీవితం చివరకు రాజకీయాల వద్దకు చేరాల్సిందేనని ఉదయనిధికి కూడా తెలుసు. దానికి సరైన సమయం వచ్చింది. తాతయ్య, తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువ నాయకుడు ఉదయనిధి. […]

తమిళనాట ఉదయిస్తున్న మరో రాజకీయ వారసుడు.. ఉదయనిధి స్టాలిన్
X

ఉదయనిధి స్టాలిన్.. ఇక కరుణానిధి మనుమడు, స్టాలిన్ కొడుకు ఏ మాత్రం కాదు. అతడు తమిళనాట ఉదయిస్తున్న మరో రాజకీయ వారసుడు. సినిమాలపై తాతయ్య సినీ వారసత్వాన్ని కొనసాగించడానికి కోలీవుడ్‌లో అడుగుపెట్టినా.. విజయం ఆయన దరి చేరలేదు. అడపా దడపా హిట్లు వచ్చినా.. తన జీవితం చివరకు రాజకీయాల వద్దకు చేరాల్సిందేనని ఉదయనిధికి కూడా తెలుసు. దానికి సరైన సమయం వచ్చింది. తాతయ్య, తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువ నాయకుడు ఉదయనిధి.

తమిళనాడు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ గత కొన్ని ఏళ్లుగా రెండు పార్టీలదే అధికారం. జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు ఉండేవి. గత ఎన్నికల్లో కూడా జయలలిత, కరుణానిధి ప్రత్యక్షంగానే తలపడ్డారు. కానీ ఐదేళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయలలిత, కరుణానిధి ఇద్దరూ మరణించడంతో ఇప్పుడు కొత్త రాజకీయ వారసులు తెరపైకి వచ్చారు.

కరుణానిధి బతికి ఉండగానే చిన్నకొడుకు స్టాలిన్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. స్టాలిన్ కూడా అధికారమే లక్ష్యంగా నాలుగేళ్లుగా తమిళనాడులో రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుత సర్వేలు చూస్తే డీఎంకే అధికారం దక్కించుకొని స్టాలిన్ సీఎం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. కానీ, అదే సమయంలో స్టాలిన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేకు జయలలిత తర్వాత ఎవరు అనే నిర్ణయం జరగకుండానే ఆమె మరణించడంతో పార్టీ చిన్నాభిన్నమైంది. ఆ పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు. కానీ డీఎంకేకు నా తర్వాత వారసుడు నా కొడుకే అని స్టాలిన్ సీఎం కాక ముందే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. గత ఏడాదిలో తమిళనాడులో డీఎంకే 100 రోజుల క్యాంపెయిన్ మొదలు పెట్టింది. అధికార అన్నాడీఎంకే లక్ష్యంగా ఈ ప్రచారం సాగించాలని నిర్ణయించింది. ఈ క్యాంపెయిన్‌ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్‌కు అప్పగించారు. నవంబర్ 20న తన తాత కరుణానిధి పుట్టిన ఊరైన థిరుక్కువలయ్ గ్రామం నుంచి ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది డీఎంకే కార్యకర్తలు, ప్రజలు వచ్చారు. అక్కడ ఆయన చేసిన ప్రసంగం ఎంతో మందికి ఆకట్టుకున్నది. అధికార అన్నాడీఎంకేపై విరుచుకపడుతూనే.. బీజేపీ తీసుకొని వచ్చిన నీట్ పరీక్షపై నిప్పులు కురిపించారు.

నీట్ వల్ల తమిళనాడు విద్యార్థులకు అపారనష్టం చేకూరుతున్నదని.. తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేసేందకు పోరాడతామని ఉదయనిధి హామీ ఇచ్చారు. ఉదయనిధి సభలకు భారీ స్పందన వస్తుండటం చూసి అన్నాడీఎంకే ప్రభుత్వం అతడిని పలు ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పలు మార్లు అరెస్టు చేసింది. అయితే ఉదయనిధి వీటన్నింటినీ తన రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటూ వచ్చారు. కేవలం డీఎంకే ప్రచారానికే పరిమితం కాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

ఇదే విషయాన్ని తండ్రి స్టాలిన్ వద్ద ప్రస్తావించగా ఆయన పార్టీ ముఖ్యులతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయనిధి రాజకీయాల్లోకి రావడం మంచిదేనని.. ఇదే సరైన సమయమని చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో తన తాత కరుణానిధి మూడు సార్లు గెలిచిన చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అయితే ఉదయనిధిని ఇప్పుడే రాజకీయాల్లోకి తీసుకొని రావడం సరైన నిర్ణయమా కాదా అనే డైలమాలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి పార్టీ పదవులకు పరిమితం చేసి వచ్చే టర్మ్‌లో అసెంబ్లీకి పంపే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరి స్టాలిన్ వారసుడు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

First Published:  25 March 2021 4:46 AM GMT
Next Story