Telugu Global
NEWS

బెజవాడ టీడీపీలో ముసలం.. బాబు జోక్యంతో తాత్కాలిక ఉపశమనం..

మున్సిపల్ ఎన్నికలు బెజవాడ టీడీపీలో చిచ్చు పెట్టాయి. గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు కాస్తా నేడు రచ్చకెక్కింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ కేశినేని నానిపై బొండా ఉమ వర్గం విరుచుకుపడింది. మాకు ఏ గొట్టంగాడు అధిష్టానం కాదు, ఆరోజే ఎంపీ నాని చెంప పగలగొట్టేవాడినంటూ బొండా ఉమ చేసిన తీవ్ర స్థాయి వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. బొండా ఉమ, కేశినేని నానితో […]

బెజవాడ టీడీపీలో ముసలం.. బాబు జోక్యంతో తాత్కాలిక ఉపశమనం..
X

మున్సిపల్ ఎన్నికలు బెజవాడ టీడీపీలో చిచ్చు పెట్టాయి. గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు కాస్తా నేడు రచ్చకెక్కింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ కేశినేని నానిపై బొండా ఉమ వర్గం విరుచుకుపడింది. మాకు ఏ గొట్టంగాడు అధిష్టానం కాదు, ఆరోజే ఎంపీ నాని చెంప పగలగొట్టేవాడినంటూ బొండా ఉమ చేసిన తీవ్ర స్థాయి వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. బొండా ఉమ, కేశినేని నానితో నేరుగా ఫోన్ లో మాట్లాడిన ఆయన అందర్నీ శాంతింపజేశారు. ఆ తర్వాత విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత, నేరుగా బొండా ఉమ ఇంటికి వెళ్లి చంద్రబాబుతోపాటు ఆదివారం జరగబోతే ప్రచారంలో పాల్గొనడానికి ఆహ్వానించే సరికి టీ కప్పులో తుపాను అణిగిపోయింది. ప్రస్తుతానికి అందరూ శాంతంగానే ఉన్నా.. బెజవాడ టీడీపీ గొడవలు పార్టీని మరింత బలహీన పరుస్తాయనడంలో ఎవరికీ అనుమానం లేదు.

అసలేంటి గొడవ..?
విజయవాడ ఎంపీ కేశినేని నాని, తన కుమార్తె శ్వేతను నగర మేయర్ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఆమెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. అయితే బొండా ఉమ వర్గం అందుకు ఒప్పుకోలేదు. గతంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారికే మేయర్ పదవి ఇచ్చారని, ఈ దఫా కాపులకి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేకపోతే బీసీ, లేదా ఇతర వర్గాలకు కేటాయించాలన్నారు. బొండా ఉమకు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా జత కలిశారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత కాదనడం, ఎస్సీ వర్గానికి చెందిన మరో నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్యకు కూడా చివరి నిమిషం వరకూ టికెట్ ఇస్తామని చెప్పి మోసగించడంతో వివాదం ముదిరింది. మున్సిపల్ ఎన్నికలకు మహూర్తం ముంచుకొస్తున్న సందర్భంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడితో కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటింపజేసుకున్నారు ఎంపీ నాని. దీంతో బొండా ఉమ వర్గం మరింత రగిలిపోయింది. మేయర్ అభ్యర్థిత్వంలో తమకు అన్యాయం జరిగిందని వారు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. చంద్రబాబుని నాని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తీరా ఆదివారం విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనే సందర్భంలో తమకు పిలుపు లేదని, రూట్ మ్యాప్ విషయం కూడా తమతో చర్చించలేదని మండిపడ్డారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిపై తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాతో ఆయన ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పారు. దీంతో వారు గంటల వ్యవధిలోనే మాట మార్చారు. కేశినేని శ్వేత అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించి.. టీడీపీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అటు నాని కుమార్తె, మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత నేరుగా బొండా ఉమ ఇంటికి వెళ్లి మంతనాలు జరపడంతో వైరి కూటమి శాంతించింది. అయితే ఈ శాంతి తాత్కాలికమేనని అంటున్నారు బెజవాడ రాజకీయాలు తెలిసినవాళ్లు. చంద్రబాబు వ్యూహం తాత్కాలికంగా ఫలించినా.. బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభమేమీ లేదని చెబుతున్నారు. ఓడిపోయే సీటుకోసం టీడీపీలో గొడవలెందుకని చెణుకులు విసురుతున్నారు.

First Published:  6 March 2021 8:59 AM GMT
Next Story