Telugu Global
NEWS

అమ్మో... ఇవేమి ఎండలు...!

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలకే తాళలేకపోతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎండలు మరింత మండిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎండలు మండిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని తెలుగు ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. తెలంగాణలోని అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎండ వేడితో ఉడికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉభయ గోదావరి, శ్రీకాకుళం, కడప, […]

అమ్మో... ఇవేమి ఎండలు...!
X

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలకే తాళలేకపోతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎండలు మరింత మండిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

ఏప్రిల్ 10 వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎండలు మండిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని తెలుగు ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

తెలంగాణలోని అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎండ వేడితో ఉడికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉభయ గోదావరి, శ్రీకాకుళం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఉదయం పది గంటల తర్వాత ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మధ్యాహ్నం పూట కర్ఫ్యూను తలపిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా వేడి గాలులు వీస్తున్నాయి. వడదెబ్బ తగిలి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.

అడుగంటుతున్న జలాశయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోవడంతో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు నీరు లేక అడుగంటుతున్నాయి. దీంతో భవిష్యత్ లో తాగునీరు కష్టమని అధికారులు చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. అక్కడున్న రిజర్వాయర్లు ఇంకిపోయాయి. ఇక నాగావళి, వంశధారల్లో అయితే చుక్కనీరు కూడా లేకుండా పోయిందంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పారే గోదావరిలో కూడా నీళ్లు ఇంకిపోయాయి.

మరో వైపు కొత్తగా ఆంధ్రప్రదేశ్ పైకి ఫొని తుపాను ముంచుకు వస్తోందంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అల్లాడుతున్నారు.

చెట్ల నరికివేత, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం పూట వీలైనంత వరకూ నీడ పట్టునే ఉండాలని, అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

First Published:  29 April 2019 10:45 PM GMT
Next Story