Telugu Global
NEWS

రాజధాని అమరావతే కొంప ముంచిందా ?

రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే గుంటూరు, క‌ృష్ణా జిల్లాలలోనే అధిక సీట్లు సాధించగలమని టీడీపీ నమ్ముతోంది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పార్టీకి అక్కడే భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పలువురు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అభ్యర్ధులతో జరిపిన సమావేశంలో కూడా పలువురు ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలను కూడా వారు సమావేశంలో వివరించినట్లు సమాచారం. రైతుల […]

రాజధాని అమరావతే కొంప ముంచిందా ?
X

రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే గుంటూరు, క‌ృష్ణా జిల్లాలలోనే అధిక సీట్లు సాధించగలమని టీడీపీ నమ్ముతోంది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పార్టీకి అక్కడే భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పలువురు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అభ్యర్ధులతో జరిపిన సమావేశంలో కూడా పలువురు ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు.

ఈ పరిస్థితికి కారణాలను కూడా వారు సమావేశంలో వివరించినట్లు సమాచారం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం, ఎదురు తిరిగిన వారిని బెదిరించడం, వాళ్ళ పంటలను తగలబెట్టడం వంటి సంఘటనలు అధికార పార్టీ మీద వ్యతిరేకతను పెంచాయని అంటున్నారు.

విజయవాడ నగరంలో జరిగిన కాల్ మనీ ఉదంతాలు కూడా ఎన్నికలపై ప్రభావాన్ని చూపాయంటున్నారు. ఇదే గనుక నిజమైతే ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి పరాభవం తప్పకపోవచ్చునని అంచనా. మంగళగిరి నుంచి రంగంలోకి దిగిన చంద్రబాబు పుత్రరత్నం కూడా ఏటికి ఎదురీదారనే చెబుతున్నారు. ఇక మిగతా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అమరావతిలో జరుగుతున్న, జరిగిన నాసిరకం నిర్మాణాలు, అక్రమాలు కళ్లారా చూసిన స్థానిక ప్రజలు వాటికి ఓటు రూపంలో గట్టిగానే సమాధానం చెప్పారని తెలుస్తోంది. ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగానే ప్రస్తావించింది.

దీంతో టీడీపీ ఓట్లకు భారీగానే గండి పడిందని అంటున్నారు. మరోవైపు, గత ఎన్నికలలో టీడీపీ తిరుగులేని విజయాలను సాధించిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని సమావేశంలో పాల్గొన్న ఆ జిల్లాల నాయకులు అన్నట్లు సమాచారం. ఈ రెండు జిల్లాలలోనూ అధికార టీడీపీ భారీగానే సీట్లు కోల్పోతుందని తెలుగు తమ్ముళ్లు సమావేశంలో చర్చించుకున్నారని తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ నేతల దాష్టీకాలను తట్టుకోలేని కొందరు లోలోపల ఆ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగానే ప్రచారం చేశారని సమాచారం. కాల్ మనీ సంఘటనలు జరిగినపుడు పోలీసులు బాధితుల పక్షాన నిలబడలేకపోయారని, అందుకు అధికార పార్టీ నేతల నుంచి ఎదురైన భారీ ఒత్తిడులే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి టీడీపీ కొంప ముంచబోతున్నాయని చెబుతున్నారు.

First Published:  22 April 2019 10:43 PM GMT
Next Story