Telugu Global
NEWS

 నీవు నేర్పిన జంపింగ్ చంద్రబాబు!

“ తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని మభ్యపెట్టి, ఆశలు చూపించి, భయానికి గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరుగుతున్న ప్రతి బహిరంగ సభలోనూ మాట్లాడుతున్నారు. అయితే ఈ జంపింగ్ జపాంగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ పార్టీ మార్పుల వ్యవహారం చంద్రబాబునాయుడు […]

 నీవు నేర్పిన జంపింగ్ చంద్రబాబు!
X

“ తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని మభ్యపెట్టి, ఆశలు చూపించి, భయానికి గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరుగుతున్న ప్రతి బహిరంగ సభలోనూ మాట్లాడుతున్నారు.

అయితే ఈ జంపింగ్ జపాంగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ పార్టీ మార్పుల వ్యవహారం చంద్రబాబునాయుడు తోనే ప్రారంభం అయిందని, చరిత్రను ఉటంకిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్గానికి చెందిన శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను అనేక ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో చేర్చుకున్నారని ఆనాటి వాస్తవాలను గుర్తు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలలో అనేక మంది ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడుదేనని అంటున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు నేతల జంపింగ్ లను ప్రోత్సహించడంలో ఏ మాత్రం తగ్గ లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మందికి పైగా శాసన సభ్యులను…. మంత్రి పదవులు ఇస్తామని, కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి పార్టీలోకి తీసుకుంది చంద్రబాబునాయుడు కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్నారు.

అధికార పార్టీ అంటే ప్రతిపక్షాలను లేకుండా చేయడం కాదని హితవు పలుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించిన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, చంద్రబాబు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, వారంతా తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి వస్తున్నారని చెబుతున్నారు. ఆ నీతిని కూడా చంద్రబాబు పాటించలేదని…. వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన వాళ్ళను రాజీనామా చేయకుండానే పార్టీలోకి చంద్రబాబు తీసుకున్నాడని గుర్తుచేస్తున్నారు.

స్వచ్ఛందంగా పదవులను వదులుకొని వస్తున్న నాయకులపై లేనిపోని అభాండాలు వేసి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారని చంద్రబాబు నాయుడు పై విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ మారడం అనే విద్య “నీవు నేర్పిన విద్య చంద్రబాబు” అని ఆయనకు హితబోధ చేస్తున్నారు.

First Published:  3 March 2019 11:13 PM GMT
Next Story