Telugu Global
NEWS

టీడీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు సెల్యూట్ కొట్టడం లేదు... విపక్ష నేతలకు కొడుతున్నారు... దీన్ని బట్టే గాలి ఎటుందో తెలుస్తోంది...

తెలంగాణకు వెళ్లి నిప్పునిప్పు అన్నందుకు నీళ్లు పోసి చంద్రబాబును ఆర్పేశారన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు ప్రచారానికి వెళ్లకముందు తెలంగాణలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉందని అక్కడి వారు తనతో చెప్పారన్నారు. ఇంతలో చంద్రబాబు మహాకూటమి గెలుపు క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రచారానికి వెళ్లారని… దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. అప్పటి వరకు ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్‌కు… చంద్రబాబు అనే విలన్‌ దొరకడంతో టీఆర్‌ఎస్ […]

టీడీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు సెల్యూట్ కొట్టడం లేదు... విపక్ష నేతలకు కొడుతున్నారు... దీన్ని బట్టే గాలి ఎటుందో తెలుస్తోంది...
X

తెలంగాణకు వెళ్లి నిప్పునిప్పు అన్నందుకు నీళ్లు పోసి చంద్రబాబును ఆర్పేశారన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు ప్రచారానికి వెళ్లకముందు తెలంగాణలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉందని అక్కడి వారు తనతో చెప్పారన్నారు. ఇంతలో చంద్రబాబు మహాకూటమి గెలుపు క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రచారానికి వెళ్లారని… దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

అప్పటి వరకు ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్‌కు… చంద్రబాబు అనే విలన్‌ దొరకడంతో టీఆర్‌ఎస్ గెలుపు చాలా సులువు అయిపోయిందన్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు కామన్‌ సెన్స్‌తో కూడా ఆలోచించలేక పోయారన్నారు. ఒకవైపు కేంద్రం అన్యాయం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెబుతూనే… మరో వైపు అభివృద్దిలో దేశంలోనే నెంబర్‌ 1 గా ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారని…. ఈ రెండు వాదనలకు పొంతన లేకుండా ఉందన్నారు.

ఆడీ కారులో వెళ్లి అడుక్కుందాం అన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. మూడు కోట్లు పెట్టి కారు కొన్నాను, ప్రత్యేక విమానం ఉంది… కానీ ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టించండి అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందన్నారు.

చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై ప్రభుత్వం చర్చకు రావాలని ఉండవల్లి కోరారు. చర్చకు చంద్రబాబు రావాల్సిన అవసరం లేదని… ప్రభుత్వం తరపున ఎవరు వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.

ఇసుకను కూడా ఏపీ నుంచి కొనుగోలు చేస్తున్న తెలంగాణలో తక్కువ ధరలకే ఇళ్లు నిర్మిస్తుంటే… ఏపీలో మాత్రం ఇసుక ఉచితంగా దొరుకుతున్నా ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు ఎందుకవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు.

నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు చివరకు అన్న క్యాంటీన్లలో కూడా ఒక్కో భోజనానికి 55 రూపాయలు చెల్లిస్తున్నారని ఉండవల్లి చెప్పారు. అదే భోజనం ఇస్కాన్‌ వాళ్లు ఐదు రెట్లు తక్కువ ధరకే అందిస్తున్నారన్నారు. ఇలా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

శ్వేతపత్రాల్లో చెప్పినవన్నీ నిజాలైతే వాటిపై చర్చ పెట్టాలని సవాల్ చేశారు. చంద్రబాబు ఇలాగే మాయ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

చంద్రబాబుపై ఇంత నెగిటివ్ ఉన్న పరిస్థితి గతంలో తానెన్నడూ చూడలేదన్నారు. గోదావరిలో ఇసుక తీయడానికే వీల్లేదని.. కానీ 20 చక్రాల లారీలు, పెద్దపెద్ద మిషన్లు పెట్టి విచ్చలవిడిగా తరిలిస్తున్నారన్నారు. ఇంత బహిరంగంగా, విచ్చలవిడిగా, నగ్నంగా అవినీతి చేస్తున్న ప్రభుత్వాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు.

తల్లికాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ అంటూ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ద్వేషం పుట్టించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు బీజేపీపై ప్రజల్లో ద్వేషం పుట్టేలా చేసి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ అన్న పార్టీనే ఏపీలో లేదని… కాబట్టి చంద్రబాబు ఆలోచన విజయం సాధించే పరిస్థితి లేదన్నారు.

మోడీ నా కంటే చెడ్డవాడు కాబట్టి నాకే ఓటేయండి అని చంద్రబాబు అడుగుతున్నారన్నారు. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు పోతుంటే పోలీసులు సెల్యూట్ కొట్టడం లేదని… అదే ప్రతిపక్ష నేతలు వెళ్తుంటే పోలీసులు సెల్యూట్ కొడుతున్నారని… దీన్ని బట్టే గాలి ఎటు తిరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసులు, అధికారులు రోజూ జనంలో తిరుగుతుంటారు కాబట్టి వారికి అసలు విషయం అర్థమైపోతోందన్నారు.

పోలవరంలో జరిగినన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. ఈ అంశంపై గిన్నిస్ బుక్‌ వాళ్లను పిలుస్తున్నామని ఉండవల్లి వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన పచ్చి మోసమన్నారు. డిసెంబర్‌ 15కు హైకోర్టు భవనాలు పూర్తవుతాయని చంద్రబాబే కోర్టుకు చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు.

జగన్ కేసులను ఆలస్యం చేయడానికి హైకోర్టులు విభజించారనడం విచిత్రంగా ఉందన్నారు. వీటిని ప్రజలు ఎలా నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో చంద్రబాబు మాటల్లో దొరికిపోయేవారు కాదని… ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడినా దొరికిపోతున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

గోదావరి ప్రాంతంలో అన్ని నిర్మాణాలు రాఫ్ట్‌ ఫౌండేషన్‌ మీదే జరుగుతాయని… చంద్రబాబు మాత్రం తానే తొలిసారిగా రాఫ్ట్‌ ఫౌండేషన్ టెక్నాలజీని తెచ్చానని చెప్పుకుంటున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు.

First Published:  2 Jan 2019 2:12 AM GMT
Next Story