Telugu Global
NEWS

హైకోర్టులో ఆంధ్రా న్యాయవాదుల ఆందోళన.... ఇప్పటికిప్పుడు వెళ్లమంటే ఎలా?

ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేయగా.. ఆంధ్రా న్యాయవాదులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టును హడావిడిగా విభజించి అమరావతి వెళ్లిపోమ్మంటే ఎలా అంటూ ఏపీ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఎలాంటి వసతులు లేవని.. తగిన సమయం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అని హైకోర్టు ఆవరణలో వాళ్లు ఆందోళన చేశారు. దీంతో ఛీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్ […]

హైకోర్టులో ఆంధ్రా న్యాయవాదుల ఆందోళన.... ఇప్పటికిప్పుడు వెళ్లమంటే ఎలా?
X

ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేయగా.. ఆంధ్రా న్యాయవాదులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉమ్మడి హైకోర్టును హడావిడిగా విభజించి అమరావతి వెళ్లిపోమ్మంటే ఎలా అంటూ ఏపీ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఎలాంటి వసతులు లేవని.. తగిన సమయం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అని హైకోర్టు ఆవరణలో వాళ్లు ఆందోళన చేశారు. దీంతో ఛీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్ బెంచ్ దిగి తన ఛాంబర్ లోకి వెళ్లిపోయారు.

ఛీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్ ఏపీ న్యాయవాదులను తన ఛాంబర్‌కి పిలిపించి మాట్లాడారు. ఏపీలో కొత్త భవనం సిద్దం కాలేదని.. ఇంకా ఉమ్మడి కేసులపై స్పష్టత లేదని…. సిబ్బంది, ఫైళ్ల విభజన కూడా పూర్తి కాలేదని…. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్లమంటారని న్యాయవాదులు ఛీఫ్ జస్టీస్‌ను ప్రశ్నించారు.

అమరావతిలో కొత్త హైకోర్టు భవనం పూర్తయి అందుబాటులోకి రావాలంటే ఇంకో రెండు నెలల సమయం పైగానే పడుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని హైకోర్టుగా ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తూ…. ఈ సమాచారాన్ని ఇప్పటికే హైకోర్టు వర్గాలకు చెప్పింది.

ఒక వేళ అమరావతికి తరలిరావడం కష్టమైతే రెండు నెలల పాటు హైదరాబాద్‌లోనే ఏపీ హైకోర్టును కొనసాగించాలని అనుకుంటోంది. అయితే రాష్ట్రపతి గెజిట్‌లో ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే కొనసాగించాలనే నిబంధన ఉంది. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల ఆ నిబంధన అడ్డు వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  27 Dec 2018 2:36 AM GMT
Next Story