Telugu Global
National

ఆర్బీఐ గవర్నర్ మోడీకి షాకిస్తారా?

ఇద్దరూ గుజరాతీయులే…. ఒకరేమో ప్రధానమంత్రి నరేంద్రమోడీ…. రెండో వ్యక్తి ఆయన ఏరికోరి తెచ్చుకున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్…. ఈ ఇద్దరూ ఆది నుంచి సమన్వయంతో ముందుకెళ్తుండగా…. ఇటీవల మోడీ ప్రభుత్వం ఆర్బీఐని శాసించాలని తీసుకుంటున్న పలు నిర్ణయాలతో ఉర్జిత్ పటేల్ ప్రేక్షక పాత్రపై విమర్శలొచ్చాయి. ఇది అంతిమంగా ఆర్బీఐ, మోడీ ప్రభుత్వం మధ్య అంతర్గత యుద్ధానికి దారితీసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఆర్బీఐ స్వతంత్రతను మోడీ దెబ్బతీస్తున్నాడంటూ విమర్శించడంతో విభేదాలు తారాస్థాయికి […]

ఆర్బీఐ గవర్నర్ మోడీకి షాకిస్తారా?
X

ఇద్దరూ గుజరాతీయులే…. ఒకరేమో ప్రధానమంత్రి నరేంద్రమోడీ…. రెండో వ్యక్తి ఆయన ఏరికోరి తెచ్చుకున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్…. ఈ ఇద్దరూ ఆది నుంచి సమన్వయంతో ముందుకెళ్తుండగా…. ఇటీవల మోడీ ప్రభుత్వం ఆర్బీఐని శాసించాలని తీసుకుంటున్న పలు నిర్ణయాలతో ఉర్జిత్ పటేల్ ప్రేక్షక పాత్రపై విమర్శలొచ్చాయి.

ఇది అంతిమంగా ఆర్బీఐ, మోడీ ప్రభుత్వం మధ్య అంతర్గత యుద్ధానికి దారితీసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఆర్బీఐ స్వతంత్రతను మోడీ దెబ్బతీస్తున్నాడంటూ విమర్శించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ద్రవ్య సంక్షోభం, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు మంజూరు చేయడం… రిజర్వ్ బ్యాంకు 9 లక్షల కోట్ల నిల్వల్లో మూడోవంతు ప్రభుత్వానికి ఇవ్వాలన్న మోడీ ప్రభుత్వ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున్నారు.

బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ప్రత్యేక లిక్విడిటీ విండో కోసం కేంద్రం చేస్తున్న డిమాండ్ కు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? లేక వ్యతిరేకిస్తాడా? అన్నది ఈ సమావేశంలో కీలకంగా మారింది.

అయితే ఇటీవలే ప్రభుత్వం చేత ఆర్బీఐలోకి నామినేట్ అయిన ఎస్ గురుమూర్తి, సుభాష్ చంద్రగార్గ్, రాజీవ్ కుమార్ లు ఆర్బీఐ నిర్ణయాలను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. వీరు బ్యాంకింగ్ పర్యవేక్షణ, పరిశ్రమలకు రుణాల ప్రవాహం మరియు రుణదాతలకు ద్రవ్యత్వ నిబంధనలను సులభతరం చేయడం వంటి కేంద్రం విధానాల గురించి వారు ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్, మోడీ మధ్య విభేదాలు వచ్చాక జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్రం కోరిక మేరకు ఆర్బీఐ తలొగ్గుతుందా.? లేక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీన్ని బట్టి ఉర్జిత్ పటేల్ విశ్వసనీయత ఏంటో తెలుస్తుందని తాజాగా రాహుల్ గాంధీ కూడా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా మీటింగ్ ఆసక్తి రేపుతోంది.

First Published:  19 Nov 2018 3:57 AM GMT
Next Story