Telugu Global
NEWS

ప్ర‌ధాని స‌భ‌లో టీడీపీ ఆందోళ‌న‌.. చంద్ర‌బాబు ప్లానేనా?

టీడీపీ – బీజేపీల మిత్ర‌బంధం బీట‌లు వారుతోందా? మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఆందోళ‌నే ఇందుకు అంకురార్ప‌ణ కానుందా? ఈ విష‌యంలో బీజేపీతో మిత్ర‌బంధాన్ని తెలుగుదేశం తెంచుకోవాల‌ని చూస్తుందా? ఇవి ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తోన్న ప్ర‌శ్న‌లు. ఎందుకంటే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేయాల‌ని చూస్తోంది తెలంగాణ టీడీపీ. ఇందుకోసం మోదీ స‌భ‌ను వేదిక‌గా చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో వ‌చ్చేనెల‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ […]

ప్ర‌ధాని స‌భ‌లో టీడీపీ ఆందోళ‌న‌.. చంద్ర‌బాబు ప్లానేనా?
X

టీడీపీ – బీజేపీల మిత్ర‌బంధం బీట‌లు వారుతోందా? మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఆందోళ‌నే ఇందుకు అంకురార్ప‌ణ కానుందా? ఈ విష‌యంలో బీజేపీతో మిత్ర‌బంధాన్ని తెలుగుదేశం తెంచుకోవాల‌ని చూస్తుందా? ఇవి ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తోన్న ప్ర‌శ్న‌లు. ఎందుకంటే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేయాల‌ని చూస్తోంది తెలంగాణ టీడీపీ. ఇందుకోసం మోదీ స‌భ‌ను వేదిక‌గా చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ‌లో వ‌చ్చేనెల‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌లో ఎలాగైనా స‌రే.. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూ నిర్వాసితుల నిర‌స‌న‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లాల‌ని టీడీపీ భారీ స్కెచ్ వేసింది. బీజేపీ – టీడీపీ మిత్ర‌ప‌క్షాలు కేంద్రంలో – ఏపీలో క‌లిసి ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేశాయి. తెలంగాణ‌లోనూ క‌లిసి పోటీ చేశాయి. ఇప్పుడు అక‌స్మాత్తుగా ప్ర‌ధాని స‌భ‌లో ఆందోళ‌న‌కు ప్రణాళిక‌లు చేస్తుండ‌టంపై క‌మ‌ల‌నాథులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ ఆందోళ‌న‌ను ప్ర‌ధానికి తెలియ‌జేసి తీరుతాం అంటూ గ‌జ్వేల్ టీడీపీ నేత వంటేరు ప్ర‌తాప‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డమే ఇందుకు కార‌ణం.

వంటేరు ప్ర‌తాప‌రెడ్డి వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మా? ఈయ‌న కూడా రేవంత్ రెడ్డిలాగే పార్టీ ఎజెండాకు విరుద్ధంగా ముందుకు వెళుతున్నాడా? అన్న విష‌యాల‌పై స్ప‌ష్ట‌త లేదు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల విష‌యంలో పోలీసుల చ‌ర్య‌ల‌ను క‌శ్మీర్‌లోయ‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌తో పోల్చారు. అంటే కేంద్రం క‌శ్మీర్‌లో కూడా ఇలాంటి విధానంలోనే ఉందా? అని ప్ర‌శ్నించారు. కేంద్రంలో పొత్తు పెట్టుకున్న పార్టీ విధానాల‌ను ప్ర‌శ్నించారంటే దీనికి చంద్ర‌బాబు అనుమ‌తించారా? లేక ఆయ‌న‌కు తెలియ‌కుండా చేస్తున్నారా? అన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఈ విష‌యంలో వంటేరు ప్ర‌తాప‌రెడ్డి.. ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అవుతారా? లేక నిజంగానే నిర‌స‌న తెలుపుతాడా? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. ఒక‌వేళ ప్ర‌ధాని స‌భలో టీడీపీ నిర‌స‌న తెలిపితే.. క‌మ‌ల‌నాథులు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

First Published:  27 July 2016 12:30 AM GMT
Next Story