Telugu Global
Others

అంబేడ్కర్ పై "పరివార్" అభూతకల్పనలు

హఠాత్తుగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రీతిపాత్రుడు అయిపోయాడు. జనతా దళ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మండల్ కమిషన్ సిఫార్సుల బూజు దులిపి ఆ సిఫార్సులను అమలు చేయాలని అప్పటి ప్రధాన మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నిర్ణయించే దాకా ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పార్టీలు, నాయకులు అంబేద్కర్ ను పెద్దగా పట్టించుకోలేదు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయాంలోనే అంబేద్కర్ కు భారత రత్న దక్కిందన్న వాస్తవం విస్మరించలేం. రాజ్యాంగ రచన సమయంలోనూ, స్వాతంత్ర్యానంతరం […]

అంబేడ్కర్ పై పరివార్ అభూతకల్పనలు
X

హఠాత్తుగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రీతిపాత్రుడు అయిపోయాడు. జనతా దళ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మండల్ కమిషన్ సిఫార్సుల బూజు దులిపి ఆ సిఫార్సులను అమలు చేయాలని అప్పటి ప్రధాన మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నిర్ణయించే దాకా ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పార్టీలు, నాయకులు అంబేద్కర్ ను పెద్దగా పట్టించుకోలేదు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయాంలోనే అంబేద్కర్ కు భారత రత్న దక్కిందన్న వాస్తవం విస్మరించలేం. రాజ్యాంగ రచన సమయంలోనూ, స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తొలి మంత్రివర్గ సభ్యునిగా అంబేద్కర్ కాంగ్రెస్ తో కలిసి పని చేసినా ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న ధ్యాసే కాంగ్రెస్ కు రాలేదు. నిజానికి భారత రత్న వల్ల అంబేద్కర్ కు కొత్తగా ఒరిగిందీ ఏమీ లేదు. అది ఆయన కీర్తి కిరీటంలో మరణానంతరం అదనంగా చేరిన తురాయి మాత్రమే.

అంబేద్కర్ మరణించిన 60 ఏళ్లకు ఆ పేరుకు విపరీతమైన ఆకర్షణ అబ్బింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన ఉత్తరదాయిత్వం కోసం ప్రధానమైన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 14 నుంచే కాంగ్రెస్, బీజేపీ అంబేద్కర్ వారసత్వంలో వాటా కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించే హడావుడిలో ఉన్నాయి. ఈ పని చేయడానికి కాంగ్రెస్ కు లేశమాత్రమైన అర్హత అయినా ఉండవచ్చునేమో కాని బీజేపీకి బొత్తిగా ఆ అధికారం లేదు. కాని అంబేద్కర్ 125వ జయంతిని బీజేపీతో పాటు సంఘ్ పరివార్ మహదవకాశంగా భావించి చిన్న అవకాశం కూడా వదలకుండా వినియోగించుకుంటోంది.

జాతీయోద్యమంతో చెప్పుకోదగ్గ సంబంధం లేని పక్షం ప్రస్తుతం అధికారంలో ఉంది. ఆ పక్షానికి ఇప్పుడు జరూరుగా జాతీయోద్యమంలో గత కీర్తిలో వాటా అవసరమైంది. ఒకరో ఇద్దరో ఉత్సవవిగ్రహాలు కావాల్సి వచ్చింది. దీనికోసం సంఘ్ పరివార్ రెండు పద్ధతులు అనుసరిస్తోంది. అందులో ప్రధానమైంది నవభారత నిర్మాత నెహ్రూను అపఖ్యాతి పాలు చేయడం. నెహ్రూ విరాణ్మూర్తిని కురచన చేయడం కోసం నెహ్రూ బదులు సర్దార్ పటేల్ మొదటి ప్రధాన మంత్రి అయి ఉంటే ఎంత బాగుండేది అన్న వాదన లేవదీశారు. గాంధీజీని సంఘ్ పరివార్ కు చెందిన నథూరాం గాడ్సే హతమార్చిన తర్వాత ఆర్.ఎస్.ఎస్. మీద నిషేధం విధించడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర నిర్వహించడం కూడా సంఘ్ పరివార్ కు అభ్యంతరకరం కాలేదు. దీనికీ కారణం లేకపోలేదు. నెహ్రూ లాగా పటేల్ మతాతీత భావాలున్న వారు కాదు. పైగా అంతో ఇంతో హిందూ మతానికి అనుకూలంగా వ్యవహరించినవారే. పెద్ద గీతను చిన్న గీత చేయాలంటే మరింత పెద్ద గీత గీయడమే సంఘ్ పరివార్ పటేల్ ను కీర్తించడంలో ఆంతర్యం.

తర్వాత అంబేద్కర్ మీద సంఘ్ పరివార్ దృష్టి పడింది. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. కాని ఆ రాజ్యాంగాన్ని ఆర్.ఎస్.ఎస్. తూలనాడిన వాస్తవాన్ని చరిత్ర తెలిసిన వారు విస్మరించలేరు. మనుస్మృతి దేశ రాజ్యంగంగా ఉండాలని ఆర్.ఎస్.ఎస్. కోరుకున్న వాస్తవాన్నీ తోసిపుచ్చలేం. మనుస్మృతి మహిళల విషయంలో వ్యక్త చేసిన అభిప్రాయాల గురించి పట్టించుకుంటే ఎంతమంది ఆ స్మృతిని నెత్తిన పెట్టుకుంటారో అనుమానమే. మహిళల చైతన్య స్థాయి గణనీయంగా పెరిగిన ఈ దశలో అసలే మనుస్మృతిని శిరసున ధరించడం అసాధ్యం.

అంబేద్కర్ మీద టన్నులకొద్దీ ప్రేమ ఒలకబోస్తున్న వారికి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాత్ర, ఆయన దార్శనికత, సైద్ధాంతికత కారణం కాదు. ఆయన దళితుడు కావడం ఇలాంటి వారికి బాగా కలిసొచ్చింది. అందుకే బ్రాహ్మణీకానికి కట్టుబడిన వర్గాలు అంబేద్కర్ మీద ఎన్నడూ లేని అభిమానం చూపడం ఆశ్చర్యమే కాదు జుగుప్స కలిగిస్తోంది. వార్కి కావాల్సింది నిజానికి అంబేద్కర్ కాదు. ఆయన అనుచరులైన దళితులు. బహుజనులు అన్న భావన చెలామణిలోకి వచ్చినప్పటి నుంది కేవలం దళితులే కాకుండా అనేకానేక వెనుకబడిన కులాల వార్కి అంబేద్కర్ మార్గదర్శి అయ్యారు. అంబేద్కర్ ను తమ వాడని చెప్పుకుంటే బహుజనుల మద్దతు సమకూరుతుందన్న దురాశ సంఘ్ పరివార్ లో బలంగా ఉంది. నిర్దిష్ట సామాజిక వర్గాలు, మతాలు ఓటు బ్యాంకులుగా మారడం మన రాజకీయ, సామాజిక వ్యవస్థలో పాతుకుపోయిన స్వార్థ చింతనకు పరాకాష్ఠ.

అంబేద్కర్ ప్రారంభించిన పార్టీ ఇప్పుడు లేదు. రూపాంతరం చెంది, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్న పార్టీ సైతం చీలికలు వాలికలైంది.

అంబేద్కర్ నిజానికి దళితులకు మాత్రమే నాయకుడు కాదు. అలా ప్రచారం చేయడం ఆయన వ్యక్తిత్వ హననానికి మాత్రమే ఉపకరిస్తుంది. ఆయన రాజకీయ సిద్ధాంతం ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్న కాంగ్రెస్ సిద్ధాంతానికి, బీజేపీ సిద్ధాంతానికి ఏ మాత్రం పొసగదు. ఒక రంకంగా ఆయన రాజకీయ సిద్ధాంతం వామపక్ష ధోరణి ఒరలోనే ఒదుగుతుంది. కాని సకల అవకాశాలను జారవిడుచుకోవడంలో అపారమైన కళాకుశలతను ప్రదర్శించడంలో ఆరి తేరిన వామపక్షాలు అంబేద్కర్ ను పట్టించుకున్న దాఖలాలు లేవు.

అంబేద్కర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి బీజేపీ రాజ్యాంగ దినోత్సవం అన్న కొత్త పండగ సృష్టించింది. దానితో కూడా పెద్ద ఫలితం దక్కలేదు. రోహిత్ వేముల ఆత్మ హత్య లాంటివి అంబేద్కర్ మీద సంఘ్ పరివార్ ఒలకబోసే అభిమానంలోని డొల్ల తనాన్ని ఎండగట్టాయి. అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి సంఘ్ పరివార్ సిద్ధంగా లేదు. ఎలాగైనా అంబేద్కర్ ఉత్తరదాయిత్వం తమదేనని చెప్పుకోవడానికి నానా అగచాట్లు పడుతోంది. నిజంగా అంబేద్కర్ ను సంఘ్ పరివార్ అభిమానించేటట్టయితే నాగపూర్ లో ఆర్.ఎస్.ఎస్. సమావేశంలో చెప్పినట్టు “అందరికీ ఒకే బావి, ఒకే అంతిమ సంస్కారం, ఒకే దేవాలయం” అన్న ప్రవచనాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి కృషి చేయాలి. ఆ ఛాయలే కనిపించడం లేదు. ఈ మాట గాంధీజీ 1924లోనే చెప్పినా ఇప్పటికీ అంటరానితనం, దళితుల మీద వ్యతిరేకత బుసలు కొడుతూనే ఉంది.

చరిత్రలో తమ వాటా కోసం ఆపసోపాలు పడుతున్న సంఘ్ పరివార్ అంబేద్కర్ కీర్తి కిరీటాన్ని కబళించాలన్న ఆతృతలో చరిత్రను వక్రీకరిస్తోంది. తమకు అనుకూలమైన చరిత్రను కృత్రిమంగా సృష్టించడానికి బాహాటంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకుడు కేశవ్ బలీరాం హెగ్డేవర్, అంబేద్కర్ మంచి మిత్రులని అంబేద్కర్ హిందూత్వను సమర్థించారని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం కొత్తగా మొదలైంది ఏమీ కాదు. బజ్రంగ్ దళ్ అధిపతిగా పని చేసిన వినయ్ కత్యార్ 2003లోనే ఈ వాదన లేవదీశారు. హెగ్డెవర్, గోల్వాల్కర్ లాగే అంబేద్కర్ హిందురాష్ట్ర భావనను సమర్థించారని సంఘ్ పరివార్ పెద్దలు బుకాయిస్తున్నారు. అంబేద్కర్ ను హిందుత్వ వాద సమర్థకుడిగా చిత్రంచడంలో ఉన్న కుట్ర సామాన్యమైంది కాదు. “హిందూ మతం సామాజిక ఐక్యతకు పొసగదు… హిందువులు ఐక్యంగా ఉండదలచుకుంటే వారు హిందూమతాన్ని విడనాడాలి. హిందూ మతాన్ని ఉల్లంఘించకుండా హిందువులు ఐక్యంగా ఉండడం సాధ్యం కాదు. హిందువుల ఐక్యతకు హిందూ మతమే ప్రధాన అవరోధం…” అన్న వాడు అంబేద్కర్. జీవితాంతం అంబేద్కర్ హిందూత్వాన్ని, ముస్లిం లీగ్ మతతత్వ భావాలను గట్టిగా వ్యతిరేకించారు. “పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా” అన్న గ్రంధంలో ఆయన మతతత్వ రాజకీయాలను తూలనాడారు.

“హిందూ రాజ్యం ఏర్పడడమే గనక వాస్తవరూపంలోకి వస్తే ఈ దేశానికి అంతకన్నా పెద్ద విపత్తు ఉండదు. స్వేచ్ఛకు, సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి హిందూత్వ పెద్ద అవరోధం” అన్నది అంబేద్కర్ అభిప్రాయం. నిజానికి ఏ మతానికి చెందిన మతపరమైన పిడివాదమైనా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనలతో పొసగేవి కావు. ఘర్ వాపసీని అంబేద్కర్ సమర్థించారు అన్నది కూడా కూడా నిఖార్సైన అసత్యమే.

హిందూ మతం మీద విరక్తి చెందినందువల్లనే చివరి రోజుల్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. సామాజిక సమానత్వం మీద ఆశతోనే హిందువులు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు క్రైస్తవమతాన్నో, ఇస్లాం మతాన్నో స్వీకరించారు, స్వీకరిస్తున్నారు. ఈ క్రమం కొనసాగితే దళితులలో అధిక సంఖ్యాకులు క్రైస్తవం స్వీకరిస్తారన్నది పరివార్ ఆందోళన. అందుకే జాతీయత మీద రాద్ధాంతం సృష్టిస్తున్నారు. అంబేద్కర్ ను హిందూ మతం గాట కట్టాలని ప్రయత్నిస్తున్నారు.

-ఆర్వీ రామారావ్

First Published:  14 April 2016 5:30 AM GMT
Next Story