Telugu Global
Others

న‌ట‌న అని తెలిసినా... సినిమా చూస్తూ ఎందుకు ఏడుస్తాం?

ఏడుపు, న‌వ్వు, ఉత్సాహం, ఉద్వేగం, ఆశ్చ‌ర్యం, భ‌యం, ఆనందం….ఒక సినిమా చూస్తున్నంత‌సేపు ఇలాంటి భావాలెన్నో తెర‌మీద వ‌చ్చిపోతుంటాయి. ప్రేక్ష‌కుడు ఆయా భావాల‌తో పాటు క‌లిసి ప్ర‌యాణం చేస్తుంటాడు. స్ప‌ష్టంగా చెప్పాలంటే సినిమా తెర, ప్రేక్ష‌కుడికి ఒక అద్దం లాంటిది. తెర‌మీది పాత్ర‌ల‌ భావోద్వేగాల‌తో స‌మానంగా త‌న‌కు తెలియ‌కుండానే ప్రేక్ష‌కుల మొహంలో హావ‌భావాలు మారుతుంటాయి. కాక‌పోతే చీక‌టి కాబ‌ట్టి ఎవ‌రూ గుర్తించ‌రు. ఎలాంటి భావోద్వేగాలు లేకుండా హావ‌భావాలు మార్చ‌కుండా సినిమా చూస్తే వారిని స్థిత‌ప్ర‌జ్ఞులు అనాల్సిందే. అస‌లు అలా […]

న‌ట‌న అని తెలిసినా... సినిమా చూస్తూ ఎందుకు ఏడుస్తాం?
X

ఏడుపు, న‌వ్వు, ఉత్సాహం, ఉద్వేగం, ఆశ్చ‌ర్యం, భ‌యం, ఆనందం….ఒక సినిమా చూస్తున్నంత‌సేపు ఇలాంటి భావాలెన్నో తెర‌మీద వ‌చ్చిపోతుంటాయి. ప్రేక్ష‌కుడు ఆయా భావాల‌తో పాటు క‌లిసి ప్ర‌యాణం చేస్తుంటాడు. స్ప‌ష్టంగా చెప్పాలంటే సినిమా తెర, ప్రేక్ష‌కుడికి ఒక అద్దం లాంటిది. తెర‌మీది పాత్ర‌ల‌ భావోద్వేగాల‌తో స‌మానంగా త‌న‌కు తెలియ‌కుండానే ప్రేక్ష‌కుల మొహంలో హావ‌భావాలు మారుతుంటాయి. కాక‌పోతే చీక‌టి కాబ‌ట్టి ఎవ‌రూ గుర్తించ‌రు. ఎలాంటి భావోద్వేగాలు లేకుండా హావ‌భావాలు మార్చ‌కుండా సినిమా చూస్తే వారిని స్థిత‌ప్ర‌జ్ఞులు అనాల్సిందే. అస‌లు అలా ఉండ‌ద‌ల‌చుకుంటే సినిమాకు వెళ్లాల్సిన‌ ప‌నే లేదు, ఎందుకంటే సినిమాలో లీన‌మై అన్ని ఉద్వేగాల‌ను అనుభ‌వించ‌డానికే మ‌నం వెళ‌తాం కాబ‌ట్టి. ఇంత‌కీ తెర‌మీద జ‌రుగుతున్న‌దంతా న‌ట‌న అని తెలిసి కూడా ఎందుకు మ‌న‌మంత‌గా క‌దిలిపోతాం. డ‌బ్బు తీసుకున్నందుకు న‌టీన‌టులు ఏడుస్తుంటే మ‌న‌మెందుకు డబ్బు ఎదురిచ్చి మరీ వారితో పాటు ఏడుస్తుంటాం.

అమెరికా, వాషింగ్ట‌న్ యూనివ‌ర్శిటీలోని డైన‌మిక్ కాగ్నిష‌న్ లేబ‌రేట‌రీ డైర‌క్ట‌ర్‌, సైకాల‌జీ ప్రొఫెస‌ర్ జ్ర‌ఫే జాక్స్ దీని గురించి వివ‌రిస్తూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

  • సంతోషంగా ఉన్న‌ట్టు న‌టిస్తే కొన్నాళ్ల‌కు అదే అల‌వాటుగా మారుతుంద‌నేది సైకాల‌జీ సూత్రం. ఇది ఇక్క‌డ వ‌ర్తిస్తుంది. కాసేపు విషాదంగా మొహం పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఆ త‌ర‌హా భావోద్వేగాలు మ‌న‌సులో చేర‌తాయి. సినిమాలో దుఃఖాన్ని చూసిన‌ప్పుడు మ‌న ముఖ క‌వ‌ళిక‌లు మారిపోతాయి. బాధ‌తో కూడిన హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తాం…అదే సినిమాలో క‌న్నీళ్లు కార్చ‌డానికి మొద‌టి మెట్టు అవుతుంది.
  • విషాద సినిమాల్లో సంగీతం ప్ర‌ధాన‌పాత్ర పోషిస్తుంది. న‌టీన‌టుల హావ‌భావాల‌కు సంగీతం తోడ‌యి మ‌న‌లో ఆ మూడ్‌ని క్రియేట్ చేస్తుంది.
  • అయితే నిజ‌జీవితంలోనూ మ‌నం అలాంటి విషాద సంగీతం విన‌డం, అలాంటి బాధ‌లు ఎదుర్కొంటున్న మ‌నుషుల‌ను చూడ‌టం జ‌రుగుతుంది. కానీ సినిమాల్లోలా ఏడ‌వ‌కుండానే సంబాళించుకుంటాం. కానీ సినిమాల్లో అలాంటి దృశ్యాలు చూస్తే మాత్రం భ‌రించ‌లేము. ఇందుకు కార‌ణం సినిమాహాల్లో కూర్చున్న‌ప్పుడు మ‌న ముందు ఇత‌ర ప్ర‌పంచం మొత్తం స్విచ్ఛాఫ్ అయిపోతుంది. ఆ దృశ్యాలు త‌ప్ప మ‌రేమీ ఉండ‌వు. అందుకే అంత‌గా అందులో లీన‌మ‌వుతాం.
  • విషాదం లాగే న‌వ్వుని, ఆనందాన్ని చూసిన‌పుడు మ‌న‌లో సంతోషం జ‌నిస్తుంది. అయితే దుఃఖం అంత తీవ్రంగా సినిమాల్లోని హాస్యం ప్రేక్ష‌కుల‌ను ‌ ప్ర‌భావితం చేయ‌దు.
  • దుఃఖ పూరిత‌మైన స‌న్నివేశాల‌ను చూస్తున్న‌ప్పుడు చాలావ‌ర‌కు మ‌న‌ల్ని మ‌నం బాధితులుగా ఊహిస్తాం. అంతే కానీ బాధ‌పెట్టేవారిగా ఊహించ‌లేము. గ‌తంలో ఎప్పుడో మ‌న మ‌న‌సులో ఏర్ప‌డిన గాయాలు, మ‌న ఆలోచ‌న‌లు, న‌మ్మ‌కాలు, అవ‌మానాలు లాంటివి కూడా సినిమాల్లో మ‌న క‌న్నీళ్ల‌ను రెట్టింపు చేస్తాయి.
  • టివిల్లో చూసే సినిమాల‌కు, సీరియ‌ల్స్‌కి కూడా ఇది వ‌ర్తిస్తుంది. అయితే సినిమా హాల్లో ఉన్నంత ప్ర‌భావం ఉండ‌దు. ఐ ఫోన్ల‌కు మాత్రం ఇది అంత‌గా వ‌ర్తించ‌దు. సినిమాహాల్లోలా చుట్టూ న‌ల్ల‌టి చీక‌టి లేక‌పోవ‌డం, ప్ర‌పంచంతో మ‌న సంబంధం పూర్తిగా క‌ట్ కాక‌పోవ‌డం ఇందుకు కార‌ణం.
  • ఒక విష‌యంలో ఎంత‌గా లీన‌మైతే అంత‌గా అది మ‌న‌ల్ని ప్ర‌భావితం చేస్తుంది. అంటే సినిమా హాల్లో కుదిరే ఏకాగ్ర‌తే సినిమా మ‌న‌ల్ని పూర్తిగా ఆక్ర‌మించేలా చేస్తుంది. ఆపై ఏడిపిస్తుంది, న‌వ్విస్తుంది.
First Published:  28 Dec 2015 7:02 PM GMT
Next Story