Telugu Global
CRIME

తోటి హంతకులనే తప్పుదారి పట్టించిన చింటూ

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. కేసు వివరాలను శుక్రవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. హత్యలు చేసింది చింటూనేనని చెప్పారు. హత్య జరిగిన రోజు చింటూతో పాటు అతడి అనుచరులు వెంకటాచలపతి, మంజు, వెంకటేష్, జయప్రకాశ్‌ నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. చింటూతో పాటు వెంకటాచలపతి బురఖాలు ధరించి మేయర్ చాంబర్‌ వద్దకు వచ్చినట్టు పోలీసులు వివరించారు. అయితే తలుపు వద్ద మేయర్ అనుచరులు అడ్డుకోవడంతో […]

తోటి హంతకులనే తప్పుదారి పట్టించిన చింటూ
X

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. కేసు వివరాలను శుక్రవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. హత్యలు చేసింది చింటూనేనని చెప్పారు. హత్య జరిగిన రోజు చింటూతో పాటు అతడి అనుచరులు వెంకటాచలపతి, మంజు, వెంకటేష్, జయప్రకాశ్‌ నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. చింటూతో పాటు వెంకటాచలపతి బురఖాలు ధరించి మేయర్ చాంబర్‌ వద్దకు వచ్చినట్టు పోలీసులు వివరించారు. అయితే తలుపు వద్ద మేయర్ అనుచరులు అడ్డుకోవడంతో చింటూ ఒక్కసారిగా బురఖా తీసి వారిని తుపాకీతో బెదరించి లోనికి చొరబడ్డాడు. లోనికి వెళ్లిందే ఆలస్యంగా తుపాకీ తీసి అనురాధ నుదిటిపై గురిపెట్టాడు. ఆమె చంపొద్దని ప్రాధేయపడినా కనికరం చూపకుండా కాల్చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయిందని పోలీస్ అధికారులు చెప్పారు.

చింటూ అనురాధపై దాడి చేస్తున్న సమయంలోనే జయప్రకాష్‌రెడ్డి, మంజులు… కఠారి మోహన్‌పై కత్తులతో దాడికి దిగారు. వారిని తప్పించుకునే ప్రయత్నంలో మోహన్ పరుగు తీయగా చింటూ తన చేతిలోని తుపాకీతో ఫైర్ చేశాడు. అయితే అది గురి తప్పి బుల్లెట్ ఎదురుగా ఉన్న తలుపుకు తాకింది. మరో మారు కాల్చే ప్రయత్నం చేయగా పిస్తోలు లాక్ అయ్యింది. పారిపోయే సమయంలో రూమ్‌లోని కార్పెట్ జారి మోహన్ కిందపడిపోగా… మరోసారి జయప్రకాషరెడ్డి, మంజులు కత్తులతో విచక్షణారహితంగా నరికారు. అనంతరం మేయర్ దంపతులు చనిపోయారన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూవెళ్లూ ఆఫీసు బాత్‌రూమ్‌లోకి కత్తిపడేసి చేతులు కడుక్కొని మరీ వెళ్లారు. గేట్లు దూకి పరారయ్యే ప్రయత్నంలో పిస్తోలు కింద పడిపోయిందని పోలీస్ అధికారులు చెప్పారు.

హంతకులు లొంగిపోయే విషయంలోనూ నాటకీయపరిణామాలు చోటు చేసుకున్నాయి. హత్యలు చేసిన తర్వాత అంతా లొంగిపోవాలనుకున్నారు. కానీ దాడిలో పాల్గొన్న అనుచరులను చింటూ తప్పుదారి పట్టించాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని ఇతర నిందితులకు సూచించిన చింటూ.. తాను ఇంటికి వెళ్లి వచ్చి వెంటనే లొంగిపోతానని నమ్మించాడు. చింటూ చెప్పిన మేరకే ఇతర నిందితులు లొంగిపోయారు. చింటూ మాత్రం తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. చింటూ తమ అదుపులో లేడని జిల్లా ఎస్పీ చెప్పారు.

First Published:  20 Nov 2015 7:45 PM GMT
Next Story