Telugu Global
Others

ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు!

ముఖ్యమంత్రి వ్యవహార శైలి సొంత పార్టీలోనే కాదు.. బీజేపీ పార్టీలోనూ చిచ్చు రాజేస్తోంది. అమరావతి శంకుస్థాపన సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం విమర్శల దాడి పెంచుతోంది. నిజానికి బీజేపీలో చంద్రబాబుకు అనుకూలంగా కేంద్ర మంత్రి వెంకయ్య, విశాఖ ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు తదితరులు ఉన్నారు. అటు వ్యతిరేక వర్గంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మంత్రి మాణిక్యాలరావు, కేంద్ర మాజీ […]

ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు!
X

ముఖ్యమంత్రి వ్యవహార శైలి సొంత పార్టీలోనే కాదు.. బీజేపీ పార్టీలోనూ చిచ్చు రాజేస్తోంది. అమరావతి శంకుస్థాపన సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం విమర్శల దాడి పెంచుతోంది. నిజానికి బీజేపీలో చంద్రబాబుకు అనుకూలంగా కేంద్ర మంత్రి వెంకయ్య, విశాఖ ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు తదితరులు ఉన్నారు. అటు వ్యతిరేక వర్గంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మంత్రి మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రులు పురంధేశ్వరి, కావూరితోపాటు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

బీజేపీలోని బాబు వ్యతిరేక వర్గం చాన్స్ దొరికినప్పుడల్లా టీడీపీని, చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నారు. అమరావతి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న కొద్దీ వ్యతిరేక స్వరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే మాజీ కేంద్రమంత్రి కావూరి టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడడం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇష్టం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు వేల కోట్ల నిధులు ఇస్తుంటే… వాటిలో ఒక్క రూపాయి కూడా బీజేపీ కార్యకర్తలకు గానీ ఇతర పార్టీల వారికి గానీ దక్కకుండా టీడీపీ వాళ్లే తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పార్టీ పరంగా నడుస్తోందన్నారు.
ఇక, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి తదితరులు ఏపీలో రైతు ఆత్మహత్యలు, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్దితులపైనా అమిత్‌షాకు డీటైల్ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. మిత్రపక్షమైనా ప్రజా సమస్యల పరిష్కారంపై ఆందోళనలు చేసేందుకు వెనకాడేది లేదని బాబు వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది. మొత్తం మీద ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గం తయారైందని ఆపార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  7 Oct 2015 12:53 AM GMT
Next Story