Telugu Global
Others

450 కోట్ల అవినీతిలో అరెస్టులను అడ్డుకుంటున్న మంత్రి

వందల కోట్ల లావాదేవీలలో అందిన కాడికి దండుకున్న అవినీతి అధికారులు, సిబ్బందికి వెన్నులో వణుకు పుడుతోంది. సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై సిబిఐ దృష్టి సారించడంతో సంబంధితులంతా బెంబేలెత్తుతున్నారు. సిసిఐ కొనుగోలు చేసిన పత్తి లావాదేవీలలో రైతుల పేరుతో దళారులు భారీగా లాభపడ్డారన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు నిర్వహించిన నిఘా సంస్థలు ఇప్పటికే అక్రమార్కులను గుర్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 450 కోట్ల మేర అవినీతి జరిగినట్టు నిఘా వర్గాలు తేల్చాయి. సిసిఐ […]

450 కోట్ల అవినీతిలో అరెస్టులను అడ్డుకుంటున్న మంత్రి
X
వందల కోట్ల లావాదేవీలలో అందిన కాడికి దండుకున్న అవినీతి అధికారులు, సిబ్బందికి వెన్నులో వణుకు పుడుతోంది. సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై సిబిఐ దృష్టి సారించడంతో సంబంధితులంతా బెంబేలెత్తుతున్నారు. సిసిఐ కొనుగోలు చేసిన పత్తి లావాదేవీలలో రైతుల పేరుతో దళారులు భారీగా లాభపడ్డారన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు నిర్వహించిన నిఘా సంస్థలు ఇప్పటికే అక్రమార్కులను గుర్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 450 కోట్ల మేర అవినీతి జరిగినట్టు నిఘా వర్గాలు తేల్చాయి. సిసిఐ మేనేజర్‌ జయకుమార్‌తోపాటు గుంటూరు, క్రోసూరు, మైలవరం, నందిగామ, చింతలపూడి కుక్కనూరు, పెదనందిపాడు తదితర యార్డులలో జరిగిన అక్రమాలను గుర్తించారు. 15 రోజుల క్రితమే కేసులు నమోదు చేసిన సిబిఐ అధికారులు ముందుగా అరెస్టులు చేసి, తరువాత ఛార్జిషీటు దాఖలు చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. సిసిఐ ద్వారా రైతుల పేరుతో దళారులకు చెక్కులు చేరిన అంశంపై ఇప్పటికే బాధ్యులతోపాటు అవినీతి క్రతువులో పాలుపంచుకున్న బయ్యర్లుపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేసిన సిబిఐ ఏరోజైనా అరెస్టులకు సిద్ధమవుతుందన్న భయం అవినీతిపరులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ అరెస్టుల భయంతో కొంతమంది అధికారులు, సిబ్బంది సెలవులపై అజ్ఞాతంలోకి వెళ్ళగా మరికొందరు సెలవులు పెట్టకుండానే ముందస్తు తేదీలతో సెలవు పత్రాలు రాసి కనిపించకుండా తిరుగుతున్నారు. అదే విధంగా వ్యాపారాలు నిర్వహించిన బయ్యర్లు కూడా పత్తా లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
పత్తి కొనుగోళ్ల అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుటామని మంత్రులు పైపైకి ప్రకటనలు చేస్తున్నా వారి మనోగతం మరోలా ఉంది. జిల్లాకు చెందిన ఓ మంత్రికి తమను బయటపడేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామని అవినీతిపరులు బేరం పెట్టినట్టు తెలుస్తోంది. తమను ఎలాగైనా గట్టెక్కించమని వారు ప్రాధేయపడుతున్నారు. దీనికి మంత్రి కూడా తన వంతు సహకారం అందించడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ‘ఇచ్చి పుచ్చుకునే ధోరణి’ ఉభయులకు లాభం చేకూరుస్తుందన్న అవినీతిపరుల వాదనతో మంత్రి ఏకీభవిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ అవకతవకలకు సంబంధించి సీబీఐ కాటన్‌ కార్పొరేషన్‌ అధికారులపై ఇప్పటికే మూడు కేసులు దాఖలు చేసింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలతోపాటు తమిళనాడులోని 18 చోట్ల సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహించారు. నివాస గృహాలు, కార్యాలయాల్లో జరిగిన ఈ తనిఖీలలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌ జయకుమార్‌, సీసీఐ గుంటూరు, క్రోసూరు, కుక్కనూరు సెంటర్‌ల ఇన్‌ఛార్జి, పత్తి కొనుగోలుదారు అయిన రాయపాటి పూర్ణచంద్రరావు, గుంటూరు, క్రోసూరు, చింతలపూడి, కుక్కనూరులలోని మార్కెట్‌ కమిటీల అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అలాగే సీసీఐ నందిగామ, పెదనందిపాడు సెంటర్ల ఇన్‌ఛార్జి డి.రాజశేఖర రెడ్డి, నందిగామ, పెదనందిపాడు మార్కెట్‌ కమిటీల అధికారులపై కేసు నమోదయ్యింది.
సీసీఐ మైలవరం ఇన్‌ఛార్జి, పత్తి కొనుగోలుదారు జి.వరుణ్‌ రఘువీర్‌, మైలవరం మార్కెట్‌ కమిటీ సూపర్‌వైజర్‌ ఎస్‌. శ్రీనివాస్‌లపైనా కేసు నమోదయ్యింది. జయకుమార్‌, పుర్ణచంద్రరావులపై నమోదైన మొదటి కేసు ఆర్‌సీ 11ఏ/2015 ప్రకారం 2014-15 సంవత్సరంలో వీరు మార్కెట్‌ యార్డులలో రైతుల నుండి కాకుండా దళారుల నుండి పత్తి కొనుగోలు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 11,75,243 క్వింటాళ్ళ పత్తి కొనుగోలు చేశారు. అంతేగాక కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుండే కొనుగోలు చేసినట్లు తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించారు. ఈ ఫోర్జరీ పత్రాల అధారంగా జయకుమార్‌ మధ్య దళారులకు పేమెంట్లు కూడ విడుదల చేశారు. ఆర్‌సీ 12ఏ అనే రెండవ కేసు ప్రకారం జయకుమర్‌తోపాటు రాజశేఖర్‌ రెడ్డి దళారుల నుండి 9,07,551.23 క్వింటాళ్ళ పత్తి కొనుగోలు చేసి పైన పేర్కొన్న పద్దతిలోనే పేమెంట్లు చెల్లించేశారు. ఆర్‌సీ 13ఏ అనే మూడవ కేసు ప్రకారం జయకుమార్‌, రఘువీర్‌, శ్రీనివాస్‌లూ ఇదే విధానంలో 3,13,402.71 క్వింటాళ్ళను దళారుల నుండి కొనుగోలు చేసి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. అవినీతి లెక్కలన్నీ పక్కాగా సేకరించినందున సీబీఐని ఎలాగైనా ముందడుగు వేయనీయకుండా చేయాలని మంత్రి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కేసులు నమోదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు సీబీఐ అధికారులు అడుగు ముందుకు వేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
First Published:  28 Aug 2015 5:55 AM GMT
Next Story