Telugu Global
Others

భూసేక‌ర‌ణ‌పై ర‌గులుతున్న రైతులు

న‌వ్యాంధ‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణం కోసం ఏపీ ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా భూ సేక‌ర‌ణకు దిగ‌డంపై రైతులు మండిప‌డుతున్నారు. భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (క్రిడా) వ‌ద్ద రైతులు ధ‌ర్నా జ‌రిపి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.  రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, వృత్తిదారుల, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ధ‌ర్నాలో రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఉండవల్లి, పెనుమాక, […]

భూసేక‌ర‌ణ‌పై ర‌గులుతున్న రైతులు
X
న‌వ్యాంధ‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణం కోసం ఏపీ ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా భూ సేక‌ర‌ణకు దిగ‌డంపై రైతులు మండిప‌డుతున్నారు. భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (క్రిడా) వ‌ద్ద రైతులు ధ‌ర్నా జ‌రిపి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, వృత్తిదారుల, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ధ‌ర్నాలో రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, మందడం, ఎర్ర బాలెం, బేతపూడి, నవుడూరు, రాయపూడి గ్రామాలనుంచి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పొలాల్లో రైతులు పండిస్తున్న కాయగూరలు తీసుకొచ్చి కార్యాలయం ముందు భైఠాయించారు. ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరులు పండే తమ భూములు రాజధానితో కనుమరుగైపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ సంఘాల ప్రతినిధులు క్రిడా కమిషనర్‌ శ్రీకాంత్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కాలంచెల్లిన జీవోలతో చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని కోరారు. రైతుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని శ్రీకాంత్‌ వారికి తెలిపారు. రాజధాని పేరిట ప్రభుత్వం రైతుల పంట పొలాలు లాక్కొనేది కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకేనని పలువురు రైతులు, నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పెద్ద ఎత్తున సాగిన ఈ ధర్నాలో సిపిఎం క్రిడా ప్రాంత కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ సింగపూర్‌ వాళ్లిచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మూడు గ్రామాల్లోని 4 వేల ఎకరాల్లో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకోవచ్చన్నారు. మిగిలింది తన అనుయాయులకు, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకే సిఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వం గల సుబ్బారావు మాట్లాడుతూ కృష్ణా నదీ తీరంలో సేకరించే 10 వేల ఎకరాల్లో ప్రభుత్వం హోటళ్లు, పబ్బులు, పర్యాటక రంగానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టే ఆలోచనలో ఉందన్నారు. ఆందోళనకు జనసేన పార్టీ ఉండవల్లి, పెను మాక ప్రాంత నాయకులు మద్దతు ప్రకటించారు.
భూస‌మీక‌ర‌ణ‌కు స్వ‌చ్చందంగా భూములిచ్చినతుళ్లూరు రైతులు కూడా భూసేక‌ర‌ణ‌ నోటిఫికేష‌న్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం కోరిన వెంట‌నే సంతోషంగా మా పొలాలిచ్చాం. అయినా ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని విడిచి పెట్ట‌కుండా ఐదు సెంట్లు, ఆరు సెంట్లు ఉన్న గ్రామ‌కంఠాల‌ను కూడా లాక్కోవాల‌ని చూస్తోంది. అదే జ‌రిగితే మంత్రుల‌ను గుర్రాల మీద ఎక్కించి ఘ‌నంగా స‌త్క‌రించిన చోట‌నే చెప్పుల‌దండ వేసి ఊరేగిస్తామ‌ని రైతులు హెచ్చ‌రించారు. పొలాలు త‌ప్ప గ్రామ‌కంఠాల భూమిని ప్ర‌భుత్వం తీసుకోద‌ని ముఖ్య‌మంత్రితోపాటు మంత్రులు నారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావులు కూడా రైతుల‌కు గ‌తంలో హామీ ఇచ్చారు. అయితే వారిచ్చిన హామీని తుంగ‌లో తొక్కార‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ మొత్తం 3,892 ఎక‌రాల్లో 1,500 ఎక‌రాలు 29 గ్రామాల ప‌రిధిలోని గ్రామ కంఠాలేన‌ని వారు చెబుతున్నారు. అయితే రైతులు ఆందోళ‌న‌లను ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌డం లేదు. భూసేక‌ర‌ణ‌పై వెన‌క్కి త‌గ్గొద్ద‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. దీంతో అధికారులు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన గ్రామాల్లో భూముల స‌మ‌గ్ర‌ స‌ర్వేను కూడా ప్రారంభించారు.
First Published:  21 Aug 2015 8:37 PM GMT
Next Story