Telugu Global
NEWS

రుణాంధ్ర‌ప్ర‌దేశ్‌... అప్పుల తిప్ప‌లు...

న‌వ్యాంధ్రప్రదేశ్‌ అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల వేతన సవరణ, రుణమాఫీలు, సామాజిక పింఛన్లు, రాయితీలు మోయలేని భారంగా మారాయి. అందుకే పాత అప్పు తీర్చడానికి కొత్త రుణానికి వెళ్లాల్సి వ‌స్తోంది. మొత్తం రుణ భారం రూ.90వేల కోట్లకు చేరనుంద‌ని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా నిధులను సర్దుబాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగమార్కెట్‌ నుంచి అప్పుల సేకరణకు వెళ్లకతప్పడంలేద‌ని వినిపిస్తోంది.  విభజన నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.15 లక్షల కోట్ల అప్పు ఉంది. […]

రుణాంధ్ర‌ప్ర‌దేశ్‌... అప్పుల తిప్ప‌లు...
X
న‌వ్యాంధ్రప్రదేశ్‌ అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల వేతన సవరణ, రుణమాఫీలు, సామాజిక పింఛన్లు, రాయితీలు మోయలేని భారంగా మారాయి. అందుకే పాత అప్పు తీర్చడానికి కొత్త రుణానికి వెళ్లాల్సి వ‌స్తోంది. మొత్తం రుణ భారం రూ.90వేల కోట్లకు చేరనుంద‌ని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా నిధులను సర్దుబాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగమార్కెట్‌ నుంచి అప్పుల సేకరణకు వెళ్లకతప్పడంలేద‌ని వినిపిస్తోంది. విభజన నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.15 లక్షల కోట్ల అప్పు ఉంది. అందులో జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం లెక్కన రూ.67,441 కోట్ల అప్పు బదిలీ అయింది. విభజన తరువాత తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బహిరంగమార్కెట్‌ నుంచి మరో రూ.11 వేల కోట్ల రుణం సేకరించింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రుణభారం రూ.78,441 కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతన సవరణ, రుణమాఫీలు, సామాజిక పింఛన్లు, రాయితీల వ‌ల్ల అప్పులు దాదాపు రెట్టింప‌య్యాయ‌ని అధికారులంటున్నారు. గత పదేళ్లలో చేసిన రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులకే ఈ ఆర్థికసంవత్సరంలో రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుచేయాల్సివస్తోంద‌ని స‌మాచారం. ఇలాంటి పరిస్థితుల్లో పాత అప్పు తీర్చడానికి కొత్త అప్ప‌లు చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. 2014-15 ఆర్థికసంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.18 వేల కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం తొలి అయిదు నెలల్లోనే రూ.6 వేల కోట్లు సేక‌రించింది. దాంతో మొత్తం అప్పులభారం రూ.84వేల కోట్లకు చేరనుంది. దీనికితోడు ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థికసాయం కింద రూ.12వేల కోట్లు తీసుకున్నారు. ఇది ఇంకా రెండురాష్ట్రాల మధ్య ఇంకా విభజన కాలేదు. దీన్ని ప్రాజెక్టులవారీగా విభజిస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ.6 వేల కోట్లు భారం పడుతుందని ఆర్థికశాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అంటే రాష్ట్రంపై మొత్తం రుణ భారం రూ.90వేల కోట్లకు చేరనుంద‌న్న‌మాట‌.
First Published:  9 Aug 2015 1:32 AM GMT
Next Story