Telugu Global
Others

ప్రాణాల‌కి వెల‌క‌డుతున్న స‌హ‌జ వ‌న‌రుల దోపిడి

న‌గ‌రంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు దుర్ఘ‌ట‌న…పున‌ర్విచార‌ణ‌ ( సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్ లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం. -ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్) ఆ రోజు తెల్ల‌వారు జామున ఆక‌స్మిక విస్పోట‌న శ‌బ్దానికి భీతిల్లిన ప‌క్షులు ఎగ‌ర‌బోయాయి. కాని చెట్లమీంచి నిర్జీవంగా నేలరాలిపోయాయి. నిద్ర నుంచి ఉలిక్కిప‌డి లేచిన జ‌నం పిడుగుపాట‌ని భ్ర‌మించారు. కాని ఇళ్ల త‌లుపులు తెరిచీ తెర‌వ‌గానే అగ్ని జ్వాలలు చొర‌బ‌డ్డాయి. మంచాల మీది పిల్లల్ని ఉన్న‌ప‌ళాన వీధుల్లోకి విసిరివేశారు. […]

ప్రాణాల‌కి వెల‌క‌డుతున్న స‌హ‌జ వ‌న‌రుల దోపిడి
X

న‌గ‌రంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు దుర్ఘ‌ట‌న…పున‌ర్విచార‌ణ‌

( సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్ లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం.
-ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్)

ఆ రోజు తెల్ల‌వారు జామున ఆక‌స్మిక విస్పోట‌న శ‌బ్దానికి భీతిల్లిన ప‌క్షులు ఎగ‌ర‌బోయాయి. కాని చెట్లమీంచి నిర్జీవంగా నేలరాలిపోయాయి. నిద్ర నుంచి ఉలిక్కిప‌డి లేచిన జ‌నం పిడుగుపాట‌ని భ్ర‌మించారు. కాని ఇళ్ల త‌లుపులు తెరిచీ తెర‌వ‌గానే అగ్ని జ్వాలలు చొర‌బ‌డ్డాయి. మంచాల మీది పిల్లల్ని ఉన్న‌ప‌ళాన వీధుల్లోకి విసిరివేశారు. ఏమి జ‌రుగుతున్న‌దో అర్థంకాక క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ప‌రుగులు తీశారు. కాని అప్ప‌టికే ప‌రిస‌రాలంత‌టా అలుముకున్న గ్యాస్ వ‌ల్ల చెల‌రేగిన పెను మంట‌లు వెంబ‌డించి చుట్టుముట్టాయి. అక్క‌డిక‌క్క‌డ నిలువెల్లా కాలిపోయిన వారు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డుతో పారిపోయారు. గెయిల్ సంస్థ నిర్ల‌క్ష్యంతో ఈ ప్ర‌మాదం జ‌రిగి ఏడాది గ‌డిచింది. కాని ఆ గాయం ఇంకా మాన‌లేదు. ఆకుప‌చ్చ‌ని ఊరు ఊరంతా నేటికీ మ‌సిబారిపోయే ఉంది.
ఈ నేప‌థ్యంలో బాధితుల‌ను మాన‌వ హ‌క్కుల వేదిక ఇటీవ‌ల ప‌రామ‌ర్శించింది. వైద్య స‌దుపాయం, న‌ష్ట‌ప‌రిహారం అందిన తీరును తెలుసుకుంది. దుర్ఘ‌ట‌న త‌దుప‌రి ప‌రిమాణాల‌ను విచారించింది.

* * *

తూర్పు గోదావ‌రి న‌గ‌రం గ్రామంలో గ‌త ఏడాది జూన్ 27న‌ గెయిల్ సంస్థ గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 22 మంది మ‌ర‌ణించారు. 19 మంది తీవ్ర గాయాల పాల‌య్యారు. ప్ర‌భుత్వం లెక్క‌ల ప్ర‌కారం ఆస్తి న‌ష్టం 75.13 ల‌క్ష‌లు. ద‌గ్థ‌మ‌యిన ఇళ్లు 16, వాహ‌నాలు 11, కొబ్బ‌రి చెట్లు 1145. మంట‌లు వ్యాపించిన విస్తీర్ణం 14.72 ఎక‌రాలు. గ్యాస్ అలుముకున్న ప‌రిధి 50 మీట‌ర్లు.
మృతుల‌కు 20 ల‌క్ష‌ల రూపాయ‌లు, క్ష‌త‌గాత్రుల‌కు 5 ల‌క్ష‌ల రూపాయ‌లను న‌ష్ట‌ప‌రిహారంగా గెయిల్ సంస్థ అందించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం మృతుని కుటుంబానికి 3 ల‌క్ష‌ల రూపాయ‌లు, కేంద్ర ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున ప‌రిహారం చెల్లించాయి. బాధితుల‌కు వైద్యం అందించే బాధ్య‌తను గెయిల్ సంస్థ తీసుకుంది.
ఇంతే. గ‌ణాంకాల ప్ర‌కారం. ఈ సంఘ‌ట‌న జ‌రిగి సంవ‌త్స‌రం గ‌డిచిపోయింది. కాబ‌ట్టి ఎక్కువ మంది మ‌రిచిపోయి ఉంటారు. అయితే, ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది ? అందుకు కార‌ణాలేమిటి ? మ‌ర‌ణించిన‌, గాయ‌ప‌డిన వ్య‌క్తుల కుటుంబాల ప‌రిస్ధితులేమిటి ? గెయిల్ సంస్థ‌, ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల మాటేమిటి ?

* * *

తూర్పు గోదావ‌రి తాటిపాక రిఫైన‌రీ నుంచి గెయిల్ అనేక ప‌రిశ్ర‌మ‌ల‌కు గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఈ ప్ర‌క్రియ పైప్‌లైన్ల ద్వారా ప‌దిహేనేళ్లుగా సాగుతోంది. అప్పుడ‌ప్పుడు గ్యాస్ లీక‌వుతూనే ఉంది. తాత్కాలిక మ‌ర‌మ్మ‌త్తుల‌తో స‌రిపెడుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన పైప్‌లైన్ ద్వారా తాటిపాక నుంచి కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లిలోని లాంకో ప‌రిశ్ర‌మ‌కు గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఒక్క‌ కృష్ణా గోదావ‌రి బేసిన్‌లోనే గెయిల్‌ కొన్ని వేల కిలోమీట‌ర్ల మేర గ్యాస్ పైప్ లైన్ల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ పైప్ లైన్ల‌న్నీ కాంట్రాక్ట‌ర్లే వేస్తారు. గెయిల్ సంస్థ ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని అంటారు. నిజానికి అనేక చోట్ల రోజువారీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టేది కాంట్రాక్టు ఉద్యోగులే.
ప్ర‌మాదం జ‌రిగిన ఈ పైప్ లైన్ ను వేసేందుకు గాను, ఛీఫ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ కు 2001 జూలైలో గెయిల్ సంస్థ అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేనుకుంది. 1989 నాటి ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాల నిల్వ‌, రవాణాకు సంబంధించిన నియ‌మాల ప్ర‌కారం ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేయాలి. ఇందులో భాగంగానే గ్యాస్ లోని తేమ‌ను తొల‌గించే ప్ర‌క్రియ చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంది. ఈ యంత్రాల ఏర్పాటుకు అంగీకరించి, ష‌ర‌తులకు క‌ట్టుబ‌డి అనుమ‌తిని పొందింది. ఇందుకు విరుద్ధంగా ప‌ద్నాగేళ్లుగా కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. పొడి గ్యాస్‌ను మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయ‌డానికి త‌యారుచేసిన పైపుల‌ను త‌డి గ్యాస్ స‌ర‌ఫ‌రాకు ఉప‌యోగిస్తోంది. య‌దేచ్ఛ‌గా నియ‌మాల‌ను ఉల్లంఘిస్తోంది. గ‌తంలో అనేక మార్లు ఈ పైప్ లైన్ లీక‌యింది. గ్రామ‌స్తుల ఫిర్యాదుల‌తో తాత్కాలిక మ‌ర‌మ్మ‌త్తులు చేయించింది. ఆ త‌ర్వాత పైపుల వంక క‌న్నెత్తి చూసింది లేదు.
గెయిల్ సంస్థ స‌ర్వే ప్ర‌కారం 2010లో ఈ పైప్ లైన్ తుప్పు ప‌ట్టింద‌ని తేలింది. త‌క్ష‌ణం నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న సూచ‌న‌లను సంస్థ ప‌ట్టించుకోలేదు.
న‌గ‌రం దుర్ఘ‌ట‌నపై విచార‌ణ జ‌రిపిన క‌మిటీల‌న్నీగెయిల్ నిర్ల‌క్షాన్నే ఎత్తిచూపాయి. ఏ ఒక్క సంఘ‌ట‌న‌కో ఈ అశ్ర‌ద్ధ ప‌రిమితం కాలేదు. పున‌రావృతమ‌వుతూనే ఉంది. అయినా గెయిల్ సంస్థ వ్య‌వ‌హార శైలిలో అణుమాత్రం మార్పు రాలేదు. ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యుల‌ను చేస్తూ, ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. ఈ కంటితుడుపు చ‌ర్య ప్ర‌జ‌ల‌ ర‌క్ష‌ణ‌కు భ‌రోసా ఇవ్వ‌దు, స‌రిక‌దా పైప్ లైన్ల నిర్వ‌హ‌ణ‌లో పాటించ‌వ‌ల‌సిన భ్ర‌ద‌తా ప్ర‌మాణాల ప‌ట్ల సంస్థ బాధ్య‌త‌నూ పెంచ‌దు.
ఇంత ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత‌, గెయిల్ సంస్థ నిర్ల‌క్ష్యం గురించి ప్ర‌జ‌లు కొంత మాట్లాడుకున్నారు. అంతేత‌ప్ప నిర‌స‌న వెల్లువెత్త‌లేదు. దీనితో చ‌మురు, స‌హ‌జ వాయు సంస్థ‌ల అల‌క్ష్యం య‌ధావిధిగా కొన‌సాగుతోంది. జ‌నావాసాలు, పంట‌పొలాల మ‌ధ్య‌ పైప్ లైన్లు వేయ‌డానికి, అస‌లు ఈ సంస్థ‌ల‌కు ఏమైనా నియ‌మావ‌ళి ఉన్న‌దా ? ఏమీ లేదు. సంస్థ అవ‌స‌రాల నిమిత్తం త‌మ సొంత ఇంజ‌నీర్ల చేత భూమిని స‌ర్వే చేయిస్తారు. ప్ర‌భుత్వాధికారుల‌నుంచి భూమి య‌జ‌మానుల వివ‌రాల‌ను సేక‌రిస్తారు. కాంట్రాక్ట‌ర్లతో ఆ భూమి కొనుగోలు చేయిస్తారు. గ్రామ పంచాయ‌తీల తీర్మానం, గ్రామ స‌భ‌ల ఆమోదం అవ‌స‌రం లేదు. వేలాది మంది ప్ర‌జ‌ల జీవ‌న భ్ర‌ద‌త‌కి సంబంధించిన ప్ర‌ధానాంశాన్ని కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య అమ్మ‌కం కొనుగోలు వ్య‌వ‌హారంగా జ‌మ‌క‌డుతున్నారు. అమ్మ‌కానికి అంగీ్క‌రించ‌ని భూమి య‌జ‌మానుల్ని వ‌త్తిళ్లు, ప్రలోభాల‌తో లొంగ‌దీస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో స్థానిక ప్ర‌భుత్వాధికారులు కూడ‌ సంస్థ‌ల‌కు అనుకూలంగానే ప‌నిచేస్తారు. ఇక రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులైతే అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి త‌లెత్తితే, శాంతింప‌చేసేందుకు భూమికి, పంట‌కి న‌ష్ట‌ప‌రిహారం పెంచుతున్నారు. అక్క‌డ‌క్క‌డ వాట‌ర్‌ప్లాంట్లు, బ‌స్‌షెల్ట‌ర్లు నిర్మిస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చిన్నా చిత‌కా ప‌నులు చేస్తున్నారు. గ‌త ఇర‌వై సంవ‌త్స‌రాలుగా ఇదే జ‌రుగుతుంది. ఇక‌ముందు కూడ ఇందుకు భిన్నంగా జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు.

* * *

గెయిల్, ఓఎన్‌జిసి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లే. రిలయెన్స్ లాంటి ప్రైవేటురంగ సంస్థ‌ల‌కు తాము ఏ మాత్రం తీసిపోమ‌ని చెపుతుంటాయి. ఏ సంస్థ‌కైనా లాభార్జ‌నే ల‌క్ష్య‌మైన‌పుడు ఏమి చేస్తుంది? మొద‌ట వీలైనంత వ‌ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించుకుంటుంది. ఈ క్ర‌మంలో చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తుంది. ప్ర‌జ‌లు, కార్మికుల భ్ర‌ద‌త‌ను, ప‌ర్యావ‌ర‌ణం, వ్య‌వ‌సాయ‌రంగాల‌ను గాలికి వ‌దిలివేస్తుంది. ఈ విష‌యంలో నిజంగానే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్రైవేటు సంస్థ‌ల‌కు ఏ మాత్రం తీసిపోకుండానే ప‌నిచేస్తున్నాయి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌కి, వ్య‌వ‌సాయ, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కి చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు కూడ తీసుకోకుండా కోట్ల కొల‌దీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ధ‌నంతో, అధికారంతో ప్ర‌జ‌ల గొంతు నొక్కేస్తున్నారు. ప్ర‌జ‌ల చైత‌న్యం అంతంత మాత్రంగా ఉండ‌టంతో, ఆయా సంస్థ‌లు నియంతృత్వంగా వ్య‌వ‌హరిస్తున్నాయి.

* * *

ఈ హ‌ఠాత్సంఘ‌ట‌న‌లో కొన్ని కుటుంబాల‌కు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈనాటికీ బాధితులు కోలుకోలేదు. అప్ప‌టిక‌ప్పుడు వైద్య స‌దుపాయం, న‌ష్ట‌ప‌రిహారం అందివుండ‌వ‌చ్చు గాక‌, దీర్ఘ‌కాలం పాటు జీవ‌నోపాధిని కోల్పోయారు. శాశ్వ‌త వైక‌ల్యం పొందిన వారితో పాటు, బాధితులు కూడ మాన‌సిక ఆందోళ‌న నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌లేదు. మొత్తం 35 కుటుంబాలకు చెందిన మనుషుల జీవ‌న శైలి త‌మ ప్ర‌మేయం లేకుండా కొన్ని క్ష‌ణాల్లో త‌ల్ల‌కిందుల‌యింది. వీరంద‌రు సాదాసీదా మ‌నుషులు, క‌ష్ట‌జీవులు. అవే పైప్ లైన్ల స‌మీపంలో ఇప్ప‌టికీ భ‌యం భ‌యంగా బ‌తుకు వెళ్ల‌దీస్తున్నారు.
బాధితుల డిమాండ్ మేర‌కు గెయిల్ సంస్థ ఇచ్చిన హామీల‌లో కొన్ని మాత్ర‌మే నెర‌వేర్చింది. 35 కుటుంబాల‌కు ప‌క్కా ఇళ్లు క‌ట్టిస్తామ‌న్నారు. కాగా న‌ష్ట‌పోయిన ఇంటికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారం ప్ర‌కటించారు. అదీ అంద‌రికీ సక్ర‌మంగా చెల్లించ‌లేదు. బాధిత కుటుంబాల‌లోని అర్హుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. ఇంజ‌నీరింగ్ చేసిన అభ్య‌ర్థుల‌కు కూడ ఏ ఉద్యోగ‌మూ ఇవ్వ‌లేదు. 30 కోట్ల రూపాయ‌ల‌తో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. స్థానికంగా ఉన్న‌టువంటి క‌మ్యూనిటీ బిల్డింగ్‌కి ఓ బోర్డు త‌గిలించి ఊరుకున్నారు. న‌గ‌రం గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని, మోడ‌ల్ విలేజ్ గా రూపొందిస్తామ‌న్నారు. ఈ మోడ‌ల్ విలేజ్ అంటే ఎవ్వ‌రికీ కించిత్తు స్ప‌ష్ట‌త లేదు.
అస‌లైన డిమాండ్ ఏమిటంటే, పైప్ లైన్ల నిర్వ‌హ‌ణ‌, భద్ర‌తా ఏర్పాట్ల విష‌యంలో స్థానిక ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, పార‌ద‌ర్శ‌కంగా ఉండ‌టం. అయితే ఈ విష‌యాల ఊసెత్తిన‌ వారే లేరు.

– యేడిద రాజేష్‌, నామాడి శ్రీ‌ధ‌ర్‌.
మాన‌వ హ‌క్కుల వేదిక కార్య‌క‌ర్తలు.

First Published:  3 Aug 2015 5:24 AM GMT
Next Story