Telugu Global
Editor's Choice

బాహుబలిపై వాడ్రేవు చిన వీరభద్రుడి పోస్ట్

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్ లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం. -ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్ ప్రస్తుతం తెలుగువాళ్ళు నిష్టగా ఆచరిస్తున్న వ్రతాలు రెండు: బాహుబలి సినిమా చూడటం, పుష్కర స్నానం చెయ్యడం. నాకు రెండింటిలోనూ నమ్మకం లేదు కాబట్టి ఎట్లానో ఈ రెండువారాలూ గడిపేసాను. కాని రోజూ ‘మీరు బాహుబలి చూసారా?’, ‘పుష్కరాలకి ఎక్కడికెళ్తున్నారు ‘ అనే పదే పదే వినబడే ప్రశ్నల్ని తట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మరీ నా కలలప్రపంచంలో నేను […]

బాహుబలిపై వాడ్రేవు చిన వీరభద్రుడి పోస్ట్
X

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్ లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం.
-ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్

ప్రస్తుతం తెలుగువాళ్ళు నిష్టగా ఆచరిస్తున్న వ్రతాలు రెండు: బాహుబలి సినిమా చూడటం, పుష్కర స్నానం చెయ్యడం. నాకు రెండింటిలోనూ నమ్మకం లేదు కాబట్టి ఎట్లానో ఈ రెండువారాలూ గడిపేసాను. కాని రోజూ ‘మీరు బాహుబలి చూసారా?’, ‘పుష్కరాలకి ఎక్కడికెళ్తున్నారు ‘ అనే పదే పదే వినబడే ప్రశ్నల్ని తట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మరీ నా కలలప్రపంచంలో నేను ఇరుక్కుపోయి ఉన్నానేమో,సమకాలిక జీవితంనుంచి తప్పించుకుని తిరుగుతున్నానేమో అనిపించి ఈ రెండు పుణ్యకార్యాల్లో కనీసం ఒక్కటేనా ఆచరించాలనుకున్నాను. చూడగా, చూడగా పుష్కరస్నానం కన్నా బాహుబలి సినిమాకి పోవడమే మేలనిపించింది. అందుకు మూడు కారణాలు: మొదటిది: బాహుబలి సినిమా విడుదలైనప్పణ్ణుంచీ ఇప్పటిదాకా ఎక్కడా ఏ థియేటర్ దగ్గరా టిక్కెట్లకోసం ఎగబడి ఎవరూ చచ్చిపోయినట్టు నేను వినలేదు. అందుకని పుష్కరాల కన్నా బాహుబలి తక్కువ జుగుప్సాకరమనిపించింది. రెండోది, బాహుబలి సినిమా చూడటానికి వి.ఐ.పి ఘాట్లంటూఏవీ ప్రత్యేకంగా లేవు. చట్టాల్ని రూపొందించే శాసనకర్తలూ, చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పే హైకోర్టు న్యాయమూర్తులూ అందరికన్నా ముందు, అందరికన్నా సులభంగా స్నానం చెయ్యడానికీ, పుణ్యం సంపాదించడానికీ పుష్కరారల దగ్గరుండే ఏర్పాట్లు బాహుబలి దగ్గర లేవు. అదీకాక, మునిగినవాళ్ళందరినీ గోదావరి ఎంత సమానంగా తీసుకుంటుందో తెలీదుగానీ, ఒక సారి సినిమాహాల్లో అడుగుపెట్టాక సుప్రీం కోర్టు న్యాయమూర్తికైనా, నాకైనా అదే సినిమా, మరో గత్యంతరం లేదు. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులవునో కాదో తెలీదుగాని, సినిమాతెరముందు మాత్రం అందరూ సమానులే. (of course, కొందరు తెరకి దగ్గరగా కూచుంటారు, కొందరు దూరంగా కూచుంటారనుకోండి). మూడో కారణం చిన్నదే, కానీ ముఖ్యమైందే. మనం మన ఆప్షన్స్ ని narrow down చేసుకోవడంలోనే జీవితసంతోషం సాధ్యపడుతుందంటారు పెద్దవాళ్ళు. పుష్కరాలకి వెళ్ళాలంటే, నాసిక్ నుంచి అంతర్వేదిదాకా ఎన్నో స్థలాలు, ఎన్నో పిలుపులు.కాని సినిమాకి వెళ్ళాలంటే మా అత్తాపూర్ దగ్గర ఎం క్యూబ్ తప్ప మరో గతి లేదు. అది కూడా ఒక కారణం. ఏమైతేనేం, గోదావరిస్నానం చేసినంత శ్రద్ధగానూ బాహుబలి సినిమా చూసాను. రెండుగంటలపైగా సినిమాచూస్తూ బయటిప్రపంచాన్ని మర్చిపోయాను. సినిమా పూర్తయ్యాక తట్టింది, మొత్తానికి బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఒకటి చూడగలిగానని. మధ్యలో హఠాత్తుగా ఏదో ఒక పేరుపెట్టుకుని గుర్రం స్వారీచేస్తూ కత్తితిప్పుతూ బ్రహ్మానందం తెరమీద విరుచుకుపడే విషాదానుభవం నుంచి నన్ను తప్పించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. అది ఒక పౌరాణిక, జానపద, చారిత్రిక, ఇన్ కాన్సిక్వెన్షియల్ ,సూపర్ సస్పెన్స్, సోషల్ ఫాంటసీ. అయినా కూడా, అమాయిక ప్రేక్షకుడిలాగా (పల్లెటూరునుంచి వచ్చినవాణ్ణి కాబట్టి సినిమా టైటిల్సునుంచీ చూడకపోతే కథ అర్థం కాదనుకుంటాన్నేను) ఒక క్షణం పాటు,ఇంతకీ బాహుబలిలో కథేమిటబ్బా అనుకున్నాను గాని, తెలుగుచిత్రదర్శకుల గురించి మరీ ఇట్లా ఆశపడుతున్నానేమిటి అనుకున్నాను. తెలుగుదర్శకుడు అనుకరించగలడుగాని, ఊహించలేడు, చూపించగలడుగాని, దర్శించలేడు, వర్ణించగలడుగాని,విశ్లేషించలేడు, చిత్రించగలడుగాని, చింతన రగల్చలేడు కదా. సినిమా అయ్యాక బయటికొచ్చాక ‘రాజ్యమా ఉలికిపడు ‘ అన్న మాట ఒకటే గుర్తొస్తూ ఉంది (అది కూడా మిత్రుడు చైతన్యప్రసాద్ రాసాడు కాబట్టి). కాని రాజ్యం నిజంగా ఉలికిపడిందా, అసలెప్పటికైనా ఉలికిపడుతుందా?

First Published:  24 July 2015 5:40 AM GMT
Next Story