Telugu Global
Others

రహదారులన్నీ కిటకిట... గోదావరి తీరం... జన సంద్రం

గంగా నది తర్వాత అత్యంత పొడవైన గోదావరి నది తీరం… ఆదిలాబాద్‌ జిల్లా బాసర నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వరకు అంతా పుణ్య పుష్కర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుష్కరాలు మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి ఘాట్‌ల వద్ద విపరీతమైన రద్దీ చోటు చేసుకుంటోంది. ఒకవైపు గోదావరి కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి ఉరకలేస్తోంది. భక్తుల రాక కూడా […]

రహదారులన్నీ కిటకిట... గోదావరి తీరం... జన సంద్రం
X
గంగా నది తర్వాత అత్యంత పొడవైన గోదావరి నది తీరం… ఆదిలాబాద్‌ జిల్లా బాసర నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వరకు అంతా పుణ్య పుష్కర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుష్కరాలు మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి ఘాట్‌ల వద్ద విపరీతమైన రద్దీ చోటు చేసుకుంటోంది. ఒకవైపు గోదావరి కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి ఉరకలేస్తోంది. భక్తుల రాక కూడా పెరగడంతో అధికారులు అప్రమత్త చర్యలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే రహదారులు మాత్రం పోయిన శని, ఆదివారాల మాదిరిగా కిక్కిరిసి పోతున్నాయి. తెలంగాణలో భద్రాచలం వైపు వెళ్ళే వాహనాలు కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు, ఇల్లెందు నుంచి పాల్వంచ వరకు నిలిచిపోయాయి. ఒకవైపు వర్షపు జలం… మరోవైపు కదలాడే జనం… రోడ్లన్నీ జనమయమయ్యాయి. దీంతో గోదావరి తీరంలో ఉన్న చిన్న చిన్న ఘాట్‌లకు డిమాండు అధికమయ్యింది. ఖమ్మం జిల్లాలోని మోతె, పర్ణశాల, కొండాయగూడెం ఘాట్‌లలో స్నానాలాచరించే వారి సంఖ్య పెరిగిపోయి విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతోపాటు తెలంగాణలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. వేములవాడ, ధర్మపురి, బాసర, భద్రాచలం, కాళేశ్వరం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద, భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరికి భక్తులు పులకించిపోతున్నారు. అయితే ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉండేందుకు అధికారులు ఎక్కడికక్కడ భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. నదిలోపలికి వెళ్ళవద్దని, గోదావరి పెరుగుతున్నందున ప్రమాదాలకు అవకాశం ఉందని, నదీ తీరంలోనే స్నానాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి
ఇక గోదావరి ప్రవహిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్‌లలో జన ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నిత్యం కిటకిటలాడే రాజమండ్రి పుష్కర ఘాట్‌, కొవ్వూరు గోష్పాద క్షేత్రం యధావిధిగా రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ముక్తేశ్వరం, రావులపాలెంతోపాటు నర్సాపురం, సిద్దాంతం, అంతర్వేది, పట్టిసీమ, దొడ్డిపట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పొట్టిపాడు టోల్‌గేటు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయిందంటే ఇక ఆ ప్రాంతంలో రద్దీ ఎలాగుందో ఊహించవచ్చు. రహదారులపై వాహనాల శ్రేణి బారులుతీరి ఉంది. నర్సాపురంలో నాగ సాధువులు గోదావరి మాతకు హారతి ఇచ్చే దృశ్యం కనులపండువగా సాగింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో ఆరామాలు భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. ఇక పిఠాపురంలో అమ్మవారి దర్శనానికి గంటల సేపు పడుతోంది. ఇవే కాకుండా నదీ సంగమంగా ఉన్న అంతర్వేదిలో లక్ష్మీనారసింహ ఆలయానికి, పావని గోదావరిని ఆనుకుని ఉన్న పట్టిసీమ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరాలు మరో రెండు రోజులే ఉండడం వల్ల రేపు, ఎల్లుండి కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు.
First Published:  23 July 2015 1:00 AM GMT
Next Story