Telugu Global
Family

దేవుడు " ఒంటె (Devotional)

ఒక గురువు శిష్యుడితో బాటు ఒంటెపై దూర ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో మజిలీ చేయాల్సివచ్చింది. ఒక చిన్న సత్రం కనిపించింది. ఆ రాత్రికి అక్కడ బసచేయాలని గురువు నిర్ణయించాడు. గురువు శిష్యుడికి ఒంటెను అప్పగించి దాన్ని కట్టెయ్యమని లోపలికి వెళ్ళాడు. శిష్యుడు ఒంటెను తాడుతో కట్టెయ్యకుండా కేవలం దేవుణ్ణి ప్రార్థించి “దేవా! ఒంటెను జాగ్రత్తగా చూసుకో” అని ఒంటెను బయట వదిలిపెట్టి సత్రంలోకి వెళ్ళాడు. గురుశిష్యులు ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే లేచి బయటికి వచ్చి […]

ఒక గురువు శిష్యుడితో బాటు ఒంటెపై దూర ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో మజిలీ చేయాల్సివచ్చింది.

ఒక చిన్న సత్రం కనిపించింది. ఆ రాత్రికి అక్కడ బసచేయాలని గురువు నిర్ణయించాడు. గురువు శిష్యుడికి ఒంటెను అప్పగించి దాన్ని కట్టెయ్యమని లోపలికి వెళ్ళాడు.

శిష్యుడు ఒంటెను తాడుతో కట్టెయ్యకుండా కేవలం దేవుణ్ణి ప్రార్థించి “దేవా! ఒంటెను జాగ్రత్తగా చూసుకో” అని ఒంటెను బయట వదిలిపెట్టి సత్రంలోకి వెళ్ళాడు.

గురుశిష్యులు ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే లేచి బయటికి వచ్చి చూస్తే ఒంటె లేదు. ఎవరో దొంగిలించారు.

గురువు “ఒంటే ఏదీ? ఎక్కడ కట్టేశావు?” అని అడిగాడు.

శిష్యుడు “ఏమో! నాకేం తెలుసు? నేను దేవుడితో ఒంటెను జాగ్రత్తగా చూడమని చెప్పాను. నేను బాగా అలసిపోయాను. అదంతా దేవుడు చూసుకుంటాడని ఆయనకే చెప్పాను. పైగా నువ్వే దేవుణ్ణి విశ్వసించు అన్నావు కదా! అందుకని భారమంతా ఆయన మీదే వేశాను” అన్నాడు.

గురువు “దేవుణ్ణి నమ్ము. కానీ మొదట ఒంటెను కట్టెయ్యి. ఎందుకంటే దేవుడికి నీ చేతులు తప్ప వేరే చేతులు లేవు” అన్నాడు.

శిష్యడు ఆశ్చర్యంగా గురువుకేసి చూశాడు.

గురువు “ఒకవేళ దేవుడు ఒంటెని కట్టెయాలనుకుంటే అందుకు ఎవర్నయినా ప్రేరేపించాలి కదా! వాళ్ళ చేతుల్తో దాన్ని కట్టెయ్యాలి కదా! ఒంటెకు దగ్గరగా ఉన్నవి నీ చేతులు కదా! మరట్లాంటప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అని నువ్వడగవచ్చు. ఎందుకంటే మొదట నువ్వు చెయ్యాల్సిన పని చేయి. నీ బాధ్యత నిర్వహించు. అప్పుడు ఏది జరిగినా అంగీకరించు. అంటే ఒంటెని కట్టెయ్యి. దేవుణ్ణి నమ్మి సోమరిగా ఉండడం సులభం. గాల్లో దీపం పెట్టి దేవుడిపై భారం వెయ్యకు. నువ్వు దేవుడిచేతిలో పనిముట్టు. దేవుడు నీతో చేయిస్తున్నాడు అన్న సంగతి మరచిపోకు” అన్నాడు.

శిష్యుడు చేసిన తప్పు గుర్తించి ఒంటెను వెతకడానికి బయల్దేరాడు.

– సౌభాగ్య

First Published:  18 July 2015 1:01 PM GMT
Next Story