Telugu Global
Family

సత్యం (Devotional)

ఒక సూఫీ మార్మికుడు ఉండేవాడు. ఆయనపేరు అబ్రహాం. అయన్ది ప్రత్యేకమయిన వ్యక్తిత్వం. ఆయన ఇతరుల కన్నా ఎంతో భిన్నమయిన వాడు. ఆయన ప్రార్థనలు కూడా వేరుగా ఉండేవి.          సాధారణంగా మనుషులు తమకున్న కష్ట నష్టాల్ని దేవుడికి చెప్పుకుని “దేవా! మమ్మల్ని ఈ కష్టాలనించీ గట్టెక్కించు, ఈ బాధల్ని తొలగించు” “మమ్మల్ని ఈ కష్టాల కడలి దాటించావంటే నీకు రుణపడివుంటాం”. ఇలాంటి ప్రార్థనలు చేస్తారు  లేదా తమ కోరికల్ని తీర్చమని, తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థిస్తారు. […]

ఒక సూఫీ మార్మికుడు ఉండేవాడు. ఆయనపేరు అబ్రహాం. అయన్ది ప్రత్యేకమయిన వ్యక్తిత్వం. ఆయన ఇతరుల కన్నా ఎంతో భిన్నమయిన వాడు. ఆయన ప్రార్థనలు కూడా వేరుగా ఉండేవి.

సాధారణంగా మనుషులు తమకున్న కష్ట నష్టాల్ని దేవుడికి చెప్పుకుని “దేవా! మమ్మల్ని ఈ కష్టాలనించీ గట్టెక్కించు, ఈ బాధల్ని తొలగించు” “మమ్మల్ని ఈ కష్టాల కడలి దాటించావంటే నీకు రుణపడివుంటాం”. ఇలాంటి ప్రార్థనలు చేస్తారు లేదా తమ కోరికల్ని తీర్చమని, తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థిస్తారు.

కానీ ఆ సూఫీ మార్మికుని ప్రార్థన చిత్రంగా ఉండేది. “భగవంతుడా! నన్ను సంతోషంగా ఉండేలా చూడమని నిన్ను కోరను కానీ ఎప్పుడూ నిన్ను ఒకటే కోరుతాను. రోజూ నన్ను బాధగా ఉండేలా చూడు. రోజూ నాకు కష్టాల బహుమతుల్ని కొన్నయినా ఇవ్వు” అని ప్రార్థించే వాడు.

ఆ సూఫీ మార్మికుడు ఒకరోజు తన మిత్రుని ఇంట్లో బస చేశాడు. ఎప్పట్లా తన ప్రార్థన మొదలు పెట్టాడు. తనకు బాధలు కావాలని, కష్టాలు కావాలని దేవుణ్ణి వేడుకున్నాడు.

అతని మిత్రుడు ఆశ్చర్యపోయాడు.

“నువ్వు చేస్తున్న పనేమిటి? దేవుడు అంటే అనురాగపూరితుడు, కరుణాళువు అని అర్థం. అట్లాంటి దేవుణ్ణి బాధలు కావాలని ప్రార్థిస్తున్నావా?” అన్నాడు.

అబ్రహాం “దేవుడు దయా సింధువు అని నాకు తెలుసు. నేను దేవుణ్ణి బాధల గుండానే చేరాను. నేను సంతోషంగా ఉంటే నేను దేవుణ్ణి మరచిపోయేవీలుంది. అందుకనే నేను దేవుణ్ణి కొద్దిగా కష్టాలు పంపమని వేడుకుంటున్నాను. నేను బాధల్లో ఉంటే దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటాను. నేను సంతోషంలో మునిగిపోయాననుకో దేవుణ్ణి మరచిపోతాను. నా ప్రార్థన అంతరార్థమది” అన్నాడు.

మిత్రుడు అబ్రహాం చెప్పిన ఆధ్యాత్మిక సత్యాన్ని విని ఆశ్చర్యపోయాడు.

– సౌభాగ్య

First Published:  9 July 2015 1:01 PM GMT
Next Story