Telugu Global
NEWS

కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా...కేసీఆర్‌తో భేటీ

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ బుధ‌వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డిఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు మంగ‌ళ‌వారం నుంచే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అదే నిజ‌మ‌య్యింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న ప‌ద‌వి కాలం అయిపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం, ఇస్తాన‌ని అధిష్టానం ఇచ్చిన మాట‌ను నిలుపుకోక‌పోవ‌డంతో డీఎస్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన […]

కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా...కేసీఆర్‌తో భేటీ
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ బుధ‌వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డిఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు మంగ‌ళ‌వారం నుంచే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అదే నిజ‌మ‌య్యింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న ప‌ద‌వి కాలం అయిపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం, ఇస్తాన‌ని అధిష్టానం ఇచ్చిన మాట‌ను నిలుపుకోక‌పోవ‌డంతో డీఎస్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత త‌న‌కు అస‌లు గుర్తింపు లేకుండా పోయింద‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెబుతూ వ‌స్తున్న డీఎస్ త్వ‌ర‌లోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ళిపోతార‌న్న ఊహాగానాలు జ‌రుగుతున్నాయి. జిల్లాకు చెందిన త‌న శిష్యురాలు ఆకుల లలితకి ఎమ్మెల్సీ సీటునిస్తూ క‌నీసం ఆ స‌మాచారాన్ని కూడా త‌న‌కు చెప్ప‌క‌పోవ‌డాన్ని డీఎస్ చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల‌కు ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న దిగ్విజ‌య్‌సింగ్ నిర్వాకంగా ఆయ‌న భావిస్తున్నారు. ఇలా ఎవ‌రికి వారు త‌న‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డాన్ని డీఎస్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీనివాస్‌ బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన‌ అనంతరం ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. వారి భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని, టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరేదీ ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తనతోపాటు ఇంకా ఎవరెవరు చేరుతున్న విషయం కూడా ఇపుడు చెప్పలేనని పేర్కొన్నారు. డీ. శ్రీనివాస్‌ను ఎలాగైనా కాంగ్రెస్‌లోనే ఉంచాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిద్దరూ డిఎస్‌ ఇంటికి వెళ్ళి ఆయనను కాంగ్రెస్‌లోనే కొనసాగవలసిందిగా కోరే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ డీఎస్‌ ఇంటికి వెళ్ళే సరికి ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. నిజానికి ఇపుడున్న కాంగ్రెస్‌ సీనియర్లలో డీఎస్ కూడా ఒకరు. ఆయన ప‌లుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అనేకమంది ముఖ్య‌మంత్రుల వ‌ద్ద మంత్రిగా వివిధ శాఖ‌లు నిర్వ‌హించారు. 2004లో, 2009లో ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండ‌గానే కాంగ్రెస్‌కు రెండుసార్లు అధికారం ద‌క్కింది. కొన్నిసార్లు ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రేసులో కూడా ఉన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న త‌న‌ను అధిష్టానం ఉపేక్షించ‌డం ఆయ‌న స‌హించ‌లేక పోతున్నారు.
రాజ్యసభ లేదా డిప్యూటీ సీఎం ఆఫర్‌?
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న డి.శ్రీనివాస్‌కు ఆ పార్టీ రెండు పదవుల్ని ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు పంపడం ఒకటి కాగా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం మరొకటి. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే బాధ్యతను టీఆర్‌ఎస్‌ డీ.శ్రీనివాస్‌కే ఇచ్చిందని చెబుతున్నారు. డీఎస్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మరికొందరు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, గ్రేటర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పటాంచెరు నియోజకవర్గంలో కీలక నాయకుడు నందీశ్వర్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ మాదం రంగారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ గూటికి వెళ్ళడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
త్వ‌ర‌లో టీఆర్ఎస్‌లో చేరిక… నిజామాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్‌ టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర‌బోతున్నారు. అయితే ఆయ‌న చేరిక‌కు ఓ వారం రోజులు ప‌ట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. చేరిక సంద‌ర్భంగా నిజామాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని డీఎస్ భావిస్తున్నారు. ఆ స‌భ ద్వారా జిల్లాలో త‌న‌కు ఎంత ప‌ట్టు ఉందో నిరూపించుకోవాల‌ని డీఎస్ త‌ల‌పోస్తున్నారు. ఆ స‌భ‌కు కేసీఆర్‌ను ఆహ్వానించాల‌ని, ఆయ‌న స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల‌ని డీఎస్ భావిస్తున్నారు. కేసీఆర్‌ను క‌ల‌వ‌డానికి ముందు టిఆర్‌ఎస్‌ ముఖ్యనేత, ఎంపీ కె.కేశవరావుతో డీఎస్‌ రహస్యంగా భేటీ అయ్యార‌ని, టిఆర్‌ఎస్‌ పార్టీలో తన స్థానం, ఇతర రాజకీయ అంశాలపై చ‌ర్చించార‌ని స‌మాచారం. కెసిఆర్‌తో సమావేశమైన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై డిఎస్‌ నిర్ణయం వెల్లడిస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులంటున్నారు. కేకేతో సమావేశమైన విషయం తెలిసిన వెంటనే టి.పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిఎస్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసినా డిఎస్‌ అందుబాటులోకి రాలేదని తెలిసింది. తెలంగాణలో బిసి సామాజిక వర్గానికి చెందిన డిఎస్‌కు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి క్షణంలో జారి పోయింది. రెండోసారి మండలికి అవకాశం ఇస్తామని డిఎస్‌కు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ హై కమాండ్‌ మాట తప్పింది. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని గ్రహించిన డిఎస్‌ కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను పార్టీని వీడాల‌న‌కుంటున్న విష‌యాన్నివివ‌రిస్తూ డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసార‌ని కూడా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్ తనకు చేసిన అన్యాయాన్ని డీఎస్ ఆ లేఖలో వివరించార‌ట‌. దానిపై సోనియా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సోనియా పుర‌మాయించిన మీద‌టే ఉత్త‌మ్ డీఎస్‌తో సంప్ర‌దించార‌ని, ఇక ఆయ‌న వెన‌క్కి త‌గ్గే అవ‌కాశాలు లేవ‌ని స‌న్నిహితులంటున్నారు. కేసీఆర్‌తో భేటీతో డీఎస్ చేరిక ఖ‌రారైపోయిన‌ట్లేన‌ని భావించాల్సి ఉంటుంది.
First Published:  1 July 2015 1:09 AM GMT
Next Story