Telugu Global
Family

సైంధవుడు (For Children)

సింధు దేశపురాజు వృద్ధక్షేత్రుడు. అతనికి లేకలేక కలిగిన సంతానమే జయద్రధుడు. అతడు పిల్లవాడుగా ఉన్పప్పుడే ఆకాశవాణి – అతను వీరుడిగా శూరుడిగా పేరు పొందినా చివరకు తల నరకబడతాడు – అని చెప్పింది. ఆమాట విన్న వృద్ధక్షేత్రుడు ఆవేదనతో ఆగ్రహంతో “ఎవరైతే నా కొడుకు తలని నేలపై పడేస్తారో వారి తల నూరు ముక్కలవుతుంది” అని శపిస్తాడు. ఆపైన కొడుకుని పెంచి పెద్దచేసి పట్టాభిషేకం కూడా చేసి తపోవనాలకు వెళ్ళిపోయాడా తండ్రి.         […]

సింధు దేశపురాజు వృద్ధక్షేత్రుడు. అతనికి లేకలేక కలిగిన సంతానమే జయద్రధుడు. అతడు పిల్లవాడుగా ఉన్పప్పుడే ఆకాశవాణి – అతను వీరుడిగా శూరుడిగా పేరు పొందినా చివరకు తల నరకబడతాడు – అని చెప్పింది. ఆమాట విన్న వృద్ధక్షేత్రుడు ఆవేదనతో ఆగ్రహంతో “ఎవరైతే నా కొడుకు తలని నేలపై పడేస్తారో వారి తల నూరు ముక్కలవుతుంది” అని శపిస్తాడు. ఆపైన కొడుకుని పెంచి పెద్దచేసి పట్టాభిషేకం కూడా చేసి తపోవనాలకు వెళ్ళిపోయాడా తండ్రి.
సింధూ దేశాన్ని ఏలడం వల్ల జయద్రధునికి సైంధవుడనే పేరు వచ్చింది. వందమంది కౌరవుల తోడ పుట్టిన ఒక్కగానొక్క ఆడబిడ్డ దుస్సలను పెళ్ళాడాడు. చాలక సాళ్వరాజు కూతుర్ని రెండో భార్యగా పెళ్ళాడాలని పరివారంతో వెళ్ళాడు. అరణ్యవాస కారణంతో కామ్యకవనంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని చూసి కోరికతో కోటి కాస్యుణ్ని కనుక్కొని రమ్మని పంపాడు. తానెవరో ఏమిటో చెప్పి, పరస్త్రీని కోరడం తప్పని చెప్పిపంపింది. సైంధవుడు ఆగలేదు. తానే వచ్చాడు. పెళ్ళాడతానంటూ కామంతో మాట్లాడాడు. ద్రౌపది నిందించింది. బుద్ది చెప్పింది. అన్న వరసవుతావంది. వావి వరసలు లేకుండా మాట్లాడడం తగదంది. సైంధవుడు కొంగులాగాడు. ద్రౌపది అతణ్ని తోసేసింది. కింద పడ్డాడు. అయినా వదలక బలవంతంగా రథంలోకి ఈడ్చి ద్రౌపదిని తనతో తీసుకు వెళ్ళాడు. పరిచారకుల వల్ల పాండవులకీ విషయం తెలిసింది. సైంధవుణ్ని వెంబడించి యుద్ధం చేసి ఓడించారు. ద్రౌపదిని వెనక్కి తెచ్చుకోవడంతో సరిపెట్టలేదు. భీమార్జునులు సింధు, సౌవీర, శిబి సైన్యాలను ఓడించి సైంధవుణ్ని బంధించి తెచ్చి ధర్మరాజు ముందు పడేశారు. భీముడు కోపంతో సైంధవుణ్ని చంపబోతే, ధర్మరాజు అడ్డుకున్నాడు. తోబుట్టువు దుస్సల సౌభాగ్యం ముఖ్యం అన్నాడు. దాంతో గుండు చేసి పాండవుల దాసుణ్నని చెప్పి బతికి పొమ్మన్నారు. అదే మాట చెప్పి ప్రాణాలతో బయటపడ్డాడు సైంధవుడు.
అవమానం అగ్నిలా కాల్చింది. చల్లార్చే తోవగా గంగానది ఒడ్డున శివుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులను ఓడించేలా వరమిమ్మని కోరాడు. అర్జునుని తప్ప మిగతా వాళ్ళని యుద్ధంలో జయిస్తావు, కాని ఒక్కరోజు మాత్రమే – అని వరమిచ్చాడు శివుడు. అహంకారంతో ఆ అవకాశం చాలనుకున్నాడు సైంధవుడు.
అభిమన్యుడు వ్యూహంతో పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. సహాయంగా ధర్మరాజు వెళ్ళబోతే సైంధవుడు అడ్డుకున్నాడు. భీమునికి కూడా అభిమాన్యుని అనుసరించే అవకాశం ఇవ్వలేదు. నకుల సహదేవులదీ అదే పరిస్థితి. అర్జునుడు వేరే వారితో యుద్ధంలో ఉన్నాడు. సైంధవుడు అడ్డుకోవడంతో అభిమాన్యుడు ఒంటరై ప్రాణాలు కోల్పోయాడు. అది తెలిసిన అర్జునుడు ఒక్క రోజులో సైంధవుణ్ని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసాడు. లేదంటే అస్త్రశస్త్రాలు అన్నీ వదిలేస్తానన్నాడు. దాంతో సైంధవుడు భయపడ్డాడు. యుద్ధం చేయనన్నాడు. దుర్యోధనుడు నేనున్నానన్నాడు. ద్రోణ, కర్ణ, శల్య, శకుని, అశ్వత్థామ, కృపాచార్యులు కాపాడుకుంటారన్నాడు. అలానే యుద్ధంలో కాపాడారు కూడా. పొద్దు గూకబోతోందని అర్జునుడు బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు మాయతో వెలుగుని చీకటి చేసాడు. పొద్దు గూకిందని యుద్ధం నిలిచిపోయిందని సైంధవుడు సంతోషంతో బయటకు వచ్చాడు. అదే అదునుగా చూసి అర్జునుడి సైంధవుని తల నరికాడు. అయితే ఆతల భూమి మీద పడకుండా చేయమని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు బాణాలు వేసి తలని ఆకాశంలో ఉండేటట్లు చేసాడు. అంతేకాదు కృష్ణుని ఆజ్ఞ మేరకు ఆ తలని పాశుపతాస్త్రంతో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షేత్రుడి ఒడిలో పడేలా చేసాడు. దాంతో ఉలికిపాటున వృద్ధక్షేత్రుడు తలని నేలమీద పడేయడంతో అతని శాపం అతనికే తగిలి తల నూరు ముక్కలయింది.
అది సైంధవుడి వధ! అలా ముగిసింది అతని కథ!.
– బమ్మిడి జగదీశ్వరరావు
First Published:  5 Jun 2015 1:02 PM GMT
Next Story