Telugu Global
Family

సావిత్రి (For Children)

సావిత్రి ఎవరో తెలుసా? సావిత్రి అంటే పార్వతీ దేవి. సరస్వతీ దేవి కూడా. సత్యవంతుని భార్య అనికూడా అర్థం. అయితే సావిత్రి అనగానే సత్యవంతుని సతియైన “సతీ సావిత్రి” గానే లోకం గుర్తు పెట్టుకుంటుంది. ఆమె కథ అటువంటిది!             మద్ర దేశపు అధిపతి అశ్వపతి. భార్య మాళవి. అన్నీవుండీ ఆ దంపతులకు లేని దొక్కటే. సంతానం. వారసత్వం కోరి సావిత్రీదేవిని పద్దెనిమిది సంవత్సరాలు ఉపాసన చేస్తే వరమున పుట్టింది కాబట్టి “సావిత్రి” అని పేరు పెట్టారు. […]

సావిత్రి ఎవరో తెలుసా?

సావిత్రి అంటే పార్వతీ దేవి. సరస్వతీ దేవి కూడా. సత్యవంతుని భార్య అనికూడా అర్థం. అయితే సావిత్రి అనగానే సత్యవంతుని సతియైన “సతీ సావిత్రి” గానే లోకం గుర్తు పెట్టుకుంటుంది. ఆమె కథ అటువంటిది!

మద్ర దేశపు అధిపతి అశ్వపతి. భార్య మాళవి. అన్నీవుండీ ఆ దంపతులకు లేని దొక్కటే. సంతానం. వారసత్వం కోరి సావిత్రీదేవిని పద్దెనిమిది సంవత్సరాలు ఉపాసన చేస్తే వరమున పుట్టింది కాబట్టి “సావిత్రి” అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసారు. పెళ్ళి వయసు వచ్చింది. లోక సంచారాన అశ్వపతి దగ్గరకు వచ్చిన నారదుడూ ఆమాటే అన్నాడు. నచ్చిన వాణ్ని కోరుకోమని, పెళ్ళి జరిపిస్తానని సావిత్రిని కోరాడు ఆమె తండ్రి. సావిత్రి అప్పటికే సత్యవంతుని గురించి విని ఉన్నది. మనసున ఆశ పడ్డది. పేరుకు అతడు “చిత్రాశ్వుడు” అయినా సత్యమే పలికేవాడు గనుక “సత్యవంతుడు” అయినాడని నారదుని నోట విన్నది. అతనే కావాలన్నది. కాని సత్యవంతునికి ఇంక ఒక్క ఏడాదే ఆయువు ఉన్నదని, తరువాత మరణిస్తాడని తెలిసాక తండ్రి వారించినా సావిత్రి వినలేదు. దాంతో సావిత్రీ సత్యవంతుల పెళ్ళి జరిపించక తప్పలేదు.

రాణివాసంలో బతికిన సావిత్రి అరణ్యవాసానికి వచ్చింది. ఆభరణాలు వదిలి నారచీరలు కట్టింది. ఎందుకంటే భర్తతోడిదే లోకం అనుకుంది. మామగారైన సాళ్వదేశపు రాజుద్యుమత్సేనుడు రాజ్యాన్ని కోల్పోయి అంధుడైవున్నాడు. భర్త అత్తమామల సేవలు చేసుకుంటూ అడవినే అంతఃపురం చేసుకుంది సావిత్రి. భర్తతో ఆనందం… ఆ వెనువెంటే భవిష్యత్తు తెలిసీ భయం… అలా రావలసిన కాలం రానే వచ్చింది… నాల్రోజులేవుంది. సావిత్రి మూడురోజుల ఉపవాస వ్రతం చేసింది. నాల్గవరోజు… సత్యవంతుని ఆయువు తీరనున్న ఆఖరిరోజు… భర్త వెంట సమిధలూ దర్భలూ పళ్ళూ తేవడానికి వెళ్తే – వద్దన్నా వెంట వచ్చింది. భర్తను వదిలి ఉండడం భార్యగా తన వల్ల కాదని చెప్పింది. వచ్చిన పని చేస్తూనే సత్యవంతుడు తీవ్రమైన తలనొప్పితో ఒంట్లోని జీవశక్తిని ఎవరో లాగేస్తున్నట్టు నొప్పిపడుతూ ఉన్నాడు. అకాలమరణం అతి దగ్గరగా వచ్చేసిందని సావిత్రి గ్రహించింది. భర్త తలని ఒడిలో పెట్టుకుంది. సత్యవంతుని ప్రాణాలు తీసుకెళ్ళడానికికని ఎదరుగా వచ్చి యముడు నిలబడ్డాడు. ఎవరు నీవు? ఎందుకొచ్చావు? అని సావిత్రి అడిగింది. ఎవ్వరి కంటికీ కనపడని తాను సావిత్రి కంటికి కనిపించడంలో ఆమె పాతివ్రత్యబలాన్ని గుర్తించాడు యముడు. వచ్చిన పని చెప్పి… పాశంతో ప్రాణాన్ని శరీరంలోంచి లాగి పట్టుకొని యముడు దక్షణ దిశగా నడిచాడు. దుఃఖంపట్టలేక ఏడుస్తూ యముని వెంటపడింది సావిత్రి. యమధర్మరాజు వద్దన్నాడు. తిరిగి వెళ్ళమన్నాడు. పతుల వెంట నడవడమే సతుల ధర్మమనీ చెప్పింది. పొమ్మన్నా భర్తను విడిచి పోలేనంది. నువ్వొచ్చే దారి దారికాదన్నా భర్తలేని నాకు ఇంకో దారేదంది. “నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకో”మని వరాన్ని ఆశచూపాడు యముడు. సావిత్రిని వదిలించుకోవచ్చని. అంధులైన అత్తమామలకు కళ్ళురావాలని కోరుకుంది. యముడు వెళ్తూ వెళ్తూ వెనక్కి చూశాడు. సావిత్రి వెంటవస్తోంది. మరొక వరం కోరుకొమ్మన్నాడు. మామగారు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి వచ్చేలా వరమడిగింది. ఇచ్చాడు. ఊపిరి పీల్చుకోబోయి యముడు వెనుదిరిగి చూసాడు. తప్పక ముచ్చటగా మూడోవరం కోరుకొమ్మన్నాడు. తన తండ్రికి పుత్రసంతానం కోరింది. ఇచ్చాడు. కోరిన వరాలతో సావత్రిని వదిలించుకున్నాననుకున్నాడు. యముడు వెళ్తూ వెనక్కి చూసాడు. సావిత్రి వెంట వస్తూనే ఉంది. భర్తను తలచి దుఃఖిస్తూనే ఉంది. యమధర్మరాజు ప్రార్థిస్తూనేవుంది. కరిగిన యముడు మరొక్క వరం కోరుకొమ్మన్నాడు. భర్త ప్రాణం తప్ప అని అనలేదు. ఈసారి భర్త ప్రాణాలే కోరింది. యముడు ఇవ్వక తప్పలేదు! అలా తిరిగి భర్తను పొందింది. పుట్టింటికీ మెట్టింటికీ మేలు కోరింది. పతిని కాపాడుకున్న సతీసావిత్రి అయ్యింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  1 Jun 2015 1:02 PM GMT
Next Story